ఐదో స్థానానికి దిగజారిన పాకిస్థాన్
దుబాయ్: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్లో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ ఐసీసీ ర్యాంకింగ్స్ జాబితాలో కిందకు పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్ జాబితాలో పాక్ రెండు స్థానాలు కోల్పోయి ఐదో ర్యాంకుకు దిగజారింది.
పాక్‌తో టెస్టు సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో పాక్ 220 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో పాక్ 97 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది. న్యూజిలాండ్ (96), శ్రీలంక (96) కేవలం ఓ రేటింగ్ పాయింట్ వెనుకబడి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (109), దక్షిణాఫ్రికా (102), ఇంగ్లండ్ (101) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.