
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మార్పులు!
కరాచీ:త్వరలో భారత్లో జరగబోయే ట్వంటీ 20 వరల్డ్ కప్ కు పాకిస్తాన్ జట్టును ఇప్పటికే ఖరారు చేసినా మరోసారి పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆసియాకప్ నుంచి పాకిస్తాన్ జట్టు అత్యంత పేలవంగా నిష్క్రమించడం కాస్తా ఆ జట్టు యాజమాన్యాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ జట్టులో మార్పులో చేయాలని భావిస్తున్నారు. వరల్డ్ టీ 20కి ఆరంభమయ్యే నాటికి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కొన్ని మార్పులతో పాటు కఠిన నిర్ణయాలు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు.
' పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టును మరోసారి పునఃసమీక్షించేందుకు సన్నద్ధమయ్యాం. గత కొంతకాలంగా అటు వన్డేల్లో, టీ 20ల్లో పాకిస్తాన్ ఘోరమైన వైఫల్యాలను ఎదుర్కొంటుంది. జట్టులో జవాబుదారీతనం అవసరం. అందుచేత టీ 20 వరల్డ్ కప్కు జట్టును సమూలంగా మార్చాలనే యోచనలో ఉన్నాం. ప్రతీ విభాగంలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టనున్నాం' షహర్యార్ ఖాన్ తెలిపారు. ఆసియాకప్లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ప్రజల్ని ఎలా నిరాశకు గురి చేసిందో, మమ్మల్ని కూడా ఆ రకంగానే బాధించింది. ఈ నేపథ్యంలో ఆకస్మిక మార్పులు చేయదలచినట్లు ఆయన స్పష్టం చేశారు.