కరాచీ: జాతీయ క్రికెట్ జట్ల పరంగా చూస్తే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్‌లో పర్యటించిన తొలి జట్టుగా నిలిచిన వెస్టిండీస్ తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే చెత్త రికార్డును మూటగట్టుకుంది. మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ నేషనల్ స్టేడియంలో ఆదివారం ఆతిథ్య పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 60 పరుగులకే ఆలౌటైంది. ఇది అంతర్జాతీయ టీ 20ల్లో విండీస్‌కు అత‍్యల్ప స్కోరుగా నమోదైంది.
ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 203 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లు పకార్ జమాన్(39;24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), హుస్సేన్ తలాత్(41;37 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ అహ్మద్(38;22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్(37 నాటౌట్; 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోవడంతో స్పల్ప స్కోరుకు పరిమితమైంది.
విండీస్ ఆటగాళ్లలో మార్లోన్ శామ్యూల్స్(18)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఎనిమిది మంది విండీస్ క్రికెటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టు స్పల్ప స్కోరుకే పరిమితమైంది. ఫలితంగా పాకిస్తాన్ 143 పరుగుల తేడాతో సాధించింది. ఇది టీ 20ల్లో పాకిస్తాన్‌కు పరుగుల పరంగా అతి పెద్ద విజయం కాగా, ఓవరాల్‌గా రెండో అతి పెద్ద విజయంగా రికార్డు పుస్తకాల్లోకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment