దుబాయ్: మైదానంలో ఒక్కరంటే ఒక్క ప్రేక్షకుడూ లేరు. సీట్లన్నీ ఖాళీగా ఉండటంతో ఏ మాత్రం పనిలేక సెక్యూరిటీ సిబ్బంది దిక్కులు చూసే పరిస్థితి! చూసేవారెవరూ లేకున్నా, చేసేదేమీ లేక ఆటను ప్రారంభించాల్సి వచ్చింది.! ... దుబాయ్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా టెస్టు తొలి రోజు ఆదివారం ఇదీ పరిస్థితి! ఇలాంటి మ్యాచ్‌కు ఐదో రోజు అనూహ్య, ఆసక్తికర, ఉత్కంఠభరిత ముగింపు! గెలుపుపై ధీమాతో బరిలో దిగిన పాక్‌కు డ్రాతో ఆసీస్ చెక్! ఈ క్రమంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ ఖాజా (302 బంతుల్లో 141; 11 ఫోర్లు) అద్భుత శతకం, ట్రావిస్ హెడ్ (175 బంతుల్లో 72; 5 ఫోర్లు); కెప్టెన్ టిమ్ పైన్ (194 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు)ల అసమాన పోరాటం. యాసిర్ షా (4/106) మెరుపు స్పెల్! ఇంతకూ ఏం జరిగిందంటే 462 పరుగుల లక్ష్య ఛేదనలో 136/3తో గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ విజయానికి మరో 326 పరుగులు చేయాలి. ‘డ్రా’ కావాలంటే రోజంతా ఆడాలి.
ఈ పరిస్థితుల్లో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఖాజా, హెడ్ లంచ్ వరకు వికెట్ కాపాడుకున్నారు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న హెడ్‌ను విరామం అనంతరం రెండో ఓవర్లోనే హఫీజ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. లబ్‌షేన్ (13)ను యాషిర్ షా వెనక్కుపంపాడు. పైన్ అండగా ఖాజా శతకం అందుకోవడంతో ఆసీస్ 289/5తో టీకి వెళ్లింది. ఆ తర్వాతా వీరు స్థిరంగా ఆడుతూ మ్యాచ్‌ను ‘డ్రా’ దిశగా తీసుకెళ్తున్న దశలో యాసిర్ షా విజృంభించాడు. ఖాజా, స్టార్క్ (1), సిడిల్ (0)లను వరుస ఓవర్లలో వెనక్కుపంపాడు. దీంతో కంగారూలు 333/8కు పడిపోయారు. ఇంకా 12 ఓవర్ల పైగా ఆట మిగిలుంది. యాసిర్ షా జోరు చూస్తే పాక్ విజయం ఖాయమనిపించింది. కానీ, పలుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న పైన్, నాథన్ లయన్ (34 బంతుల్లో 5 నాటౌట్) తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ అడ్డుగోడగా నిలిచారు. 362/8తో ఆసీస్ రోజును ముగించి పరాజయం కోరల నుంచి బయటపడింది. మ్యాచ్‌లో ఖాజా 524 నిమిషాలు, పైన్ 219 నిమిషాలు, హెడ్ 197 నిమిషాలు క్రీజులో నిలవడం గమనార్హం.
దుబాయ్‌లో హై‘డ్రా’మా
Published Fri, Oct 12 2018 1:21 AM | Last Updated on Fri, Oct 12 2018 1:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment