
ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ విజయం
మిర్పూర్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. పాకిస్తాన్ విసిరిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఆటగాళ్లు చతికిలబడ్డారు. ఆదిలోనే డేవిడ్ వార్నర్(4) వికెట్టును ఆసీస్ కోల్పోయి నిరాశకు లోనైంది. అనంతరం షేన్ వాట్సన్(4) అదే బాటలో పయనించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ తరుణంలో ఓపెనర్ ఫించ్ కు జతకలిసిన మ్యాక్ వెల్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోప్రక్క ఫించ్ నెమ్మదిగా ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఆసీస్ కు పునాది వేశాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడిన మ్యాక్ వెల్(74;౩౩ బంతుల్లో 6 సిక్స్ లు, 7 ఫోర్లు), ఫించ్ (65; 54 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు) చేసి కొద్ది పాటి వ్యవధిలో పెవిలియన్ చేరారు.
ఇక అప్పటి వరకూ నల్లేరు మీద నడకలా సాగిన ఆసీస్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైన ఆసీస్ కు ఓటమి తప్పలేదు. ఆసీస్ ఆటగాళ్లలో 9 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. పాక్ బౌలర్లలో బిలావతి భట్టి, షాహిద్ ఆఫ్రిది, ఉమర్ గుల్, జుల్పికర్ బాబర్ లు తలో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఉమర్ అక్మల్ (94), కమ్రాన్ అక్మల్ (31), షాహిద్ ఆఫ్రిది(20) పరుగులు సాయంతో 191 పరుగులు చేసింది.