
పార్థీవ్ అతుక్కుపోయాడా?
ముంబై:భారత క్రికెట్ జట్టు..ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రత్యర్థి జట్లకు కఠినమైన సవాల్ విసురుతున్న జట్టు. ప్రత్యేకంగా టెస్టుల్లో భారత్ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు అనేక అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుని టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, ఓవరాల్గా భారత క్రికెట్ జట్టులో తీవ్రమైన పోటీ నెలకొంది. అటు వన్డేల్లో కానీ ఇటు టెస్టుల్లో కానీ యువ క్రికెటర్లు తమను నిరూపించుకుంటూ భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లగా స్థిరపడే యోచనలో ఉన్నారు. గతంలో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు మనీష్ పాండే, అజింక్యా రహానే విషయంలో ఇదే పోటీని చూశాం. వన్డేల్లో ఏడోస్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్ల అన్వేషణలో వీరి మధ్య పోటీ సాగింది. ఆ తరువాత భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. బ్యాటింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దగ్గర్నుంచీ కేదర్ జాదవ్, జయంత్ యాదవ్లు ఇప్పటికే తమను నిరూపించుకున్నా ఇంకా వారి రెగ్యులర్ స్థానంపై భరోసా అయితే లేదు. దానికి కారణం భారత జట్టులో తీవ్రమైన పోటీనే.
ఇదే సమయంలో ఎనిమిదేళ్ల తరువాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ తన స్థానంపై ఆశలు పెట్టుకున్నాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మొహాలిలో జరిగిన మూడో టెస్టులో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పార్థీవ్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసిన పార్థీవ్.. రెండో ఇన్నింగ్స్లో 67 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు. తన అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయిందనుకున్న తరుణంలో పార్థీవ్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. ఇలా భారత జట్టులో సుదీర్ఘ కాలం తరువాత పునరాగమనం చేయడం రికార్డే అయినా, అందుకు కారణం మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లేలే. ఈ విషయాన్ని పార్థీవ్ స్వయంగా చెప్పాడు కూడా. ఒకవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో విశేషంగా రాణిస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను సైతం పక్కకు పెట్టి, పార్థీవ్ కు అవకాశం కల్పించారు. దేశవాళీ టోర్నీల్లో పార్థీవ్ కూడా మెరుగ్గా రాణించడంతోనే అతని ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ తరుణంలో సెలక్టర్లకు పార్థీవ్ నుంచి ఊహించని సవాలే ఎదురవుతుందనే చెప్పాలి. ఎటువంటి తడబాటు లేకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంతో పార్థీవ్ను ఉన్నపళంగా తప్పించే కారణాలు కనబడుటం లేదు. మరొవైపు ఇంగ్లండ్ తో ముంబైలో జరిగే నాల్గో టెస్టులో పార్థీవ్ ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా వృద్దిమాన్ సాహా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో పార్థీవ్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే కనబడుతోంది. ఒకవేళ ఆ టెస్టులో కూడా పార్థీవ్ మరోసారి రాణిస్తే మాత్రం సెలక్టర్లకు తలనొప్పి తప్పకపోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని టెస్టులకు వీడ్కోలు చెప్పిన తరువాత సాహానే భారత జట్టుకు రెగ్యులర్ కీపర్గా మారిపోయాడు. ఈ సమయంలో పార్థీవ్ నుంచి పోటీ ఏర్పడటంతో సాహా కూడా మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిఉంది. ఇటీవల కాలంలో భారత వెటరన్ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంలో కోహ్లి, కుంబ్లే వెనుకడుగు వేయడం లేదు. ఇదే తరహాలో న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో జరిగిన టెస్టులో గంభీర్ అవకాశం ఇచ్చారు. ఆ విషయాన్నిపక్కకు పెడితే ప్రస్తుతం అటు బ్యాటింగ్ లోనూ ఇటు కీపింగ్లోనూ తనదైన మార్కుతో సత్తా చాటుకున్న పార్థీవ్.. భారత జట్టులో జెండా పాతినట్లే కనబడుతోంది. మరోసారి పార్థీవ్ చెలరేగితే మాత్రం అతను జట్టులో మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.