పట్నా పట్టేసింది...
► ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా పైరేట్స్
► ఫైనల్లో యు ముంబా ఓటమి
► విజేతకు రూ. కోటి ప్రైజ్‌మనీ
► రన్నరప్‌కు రూ.50 లక్షలు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నూతన చాంపియన్‌గా పట్నా పైరేట్స్ అవతరించింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పట్నా జట్టు 31-28 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాను ఓడించింది. సూపర్ రైడింగ్‌తోనే కాకుండా అద్భుత డిఫెన్స్‌తో దుమ్ము రేపిన పట్నా పైరేట్స్‌కు ఇది తొలి టైటిల్. విజేతకు రూ.కోటి ప్రైజ్‌మనీ లభించగా... రన్నరప్‌గా నిలిచిన ముంబాకు రూ.50 లక్షలు అందాయి. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థిగా డిఫెండింగ్ చాంపియన్ ఉన్నా... పట్నా మాత్రం తన దూకుడును తగ్గించుకోలేదు. తొలి పాయింట్ ముంబా సాధించినా ఆ తర్వాత పట్నా జోరు సాగించింది. 7వ నిమిషంలోనే ఆ జట్టును ఆలౌట్ చేయగలిగింది. 17వ నిమిషంలో రోహిత్ కుమార్ సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు సాధించాడు.
అయితే ఆ వెంటనే తన మరో రైడ్‌లో మాత్రం ముంబా కోర్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు సూపర్ టాకిల్‌తో పట్టేసి రెండు పాయింట్లు సాధించారు. ఇక అప్పటి నుంచి ప్రథమార్ధం మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనే వరకు ముంబా ఆటగాళ్లు అద్వితీయ ఆటను ప్రదర్శించారు. 6-19తో వెనుకబడిన ఈ దశ నుంచి వరుసగా 5 పాయింట్లు సాధించి 11-19కి ఆధిక్యం తగ్గించారు. ఇక ద్వితీయార్ధం ఆట ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఆరంభంలో పట్నా పాయింట్లు సాధించినా ఒక్కసారిగా ముంబా పుంజుకుని 29వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేసింది. దీంతో 20-24 స్కోరుతో పట్నాపై ఒత్తిడి పెరిగింది.
చివరి ఐదు నిమిషాల్లో అయితే ఈ రెండు ఉత్తమ డిఫెన్స్ జట్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు కనిపించింది. స్టార్ రైడర్ రోహిత్‌పై దృష్టి పెట్టిన ముంబా సఫలం కావడంతో పట్నా ఇబ్బంది పడింది. 39వ నిమిషంలో అనూప్ కుమార్ పాయిం ట్‌తో ముంబా 28-28తో స్కోరును సమం చేసి ఉత్కంఠను పెంచింది. అయితే దీపక్ నర్వాల్ పట్నాకు పాయింట్ అందించగా స్కోరు 29-28కి పెరి గింది. మరోవైపు ముంబా కెప్టెన్ అనూప్ ఫౌల్ కావడంతో పాటు చివరి సెకన్లలో సందీప్ నర్వాల్ పాయిం ట్‌తో పట్నా 31-28తో విజయం అందుకుంది.
పుణెరికి మూడో స్థానం
ఫైనల్‌కు ముందు జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో పుణెరి పల్టన్ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. పుణెరి 31-27తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పుణెరికి రూ.30 లక్షల ప్రైజ్‌మనీ, బెంగాల్‌కు రూ.20 లక్షలు దక్కాయి. దీపక్ హుడా 8, అజయ్ ఠాకూర్ 4 పాయింట్లు సాధించారు. బెంగాల్ నుంచి జాంగ్ కున్ లీ 8, మహేంద్ర గణేష్ 5 పాయింట్లు సాధించారు.