మాపై ఇంత నిర్దయ ఎందుకు?
లండన్: గత ఏడేళ్లుగా పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపడం లేదు. దీనిపై పీసీబీ ముమ్మర యత్నాలు చేస్తున్నా అవి ఆశాజనకంగా ఉండటం లేదు. 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత మరే దేశం ఆ దేశంలో అడుగుపెట్టేందుకు ముందడుగు వేయలేదు. దీంతో పాకిస్తాన్ తమ స్వదేశీ మ్యాచ్లను ఆడేందుకు యూఏఈను ఎంచుకుంటుంది. ఈ నేపథ్యంలో పీసీబీ ఆదాయానికి తీవ్రంగా గండిపడుతుంది.
తాజాగా బంగ్లాదేశ్ లో పర్యటించడానికి ఇంగ్లండ్ జట్టు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ అంశాన్ని పాకిస్తాన్ తీవ్రంగా పరిగణించింది. గతంలో భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి నిరాకరించిన ఇంగ్లండ్.. ఇప్పుడు వరుస దాడులతో విలవిల్లాడుతున్న బంగ్లాదేశ్లో ఆడటానికి ఈసీబీ(ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) ఎలా సానుకూలంగా స్పందించాల్సి వచ్చిందో చెప్పాలంటూ పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రశ్నించారు. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వద్ద పంచాయితీ పెడతామని హెచ్చరించారు. ఈ సెక్యూరిటీ కారణాలు చూపెట్టి తమ దేశ పర్యటనకు మొగ్గు చూపని ఇంగ్లండ్.. అదే సెక్యూరిటీ కారణాలను బంగ్లాదేశ్ పర్యటించేటప్పుడు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. దీనిపై తమకు ప్రత్యేక పరిహారం ఇప్పించాలని ఐసీసీని షహర్యార్ డిమాండ్ చేశారు.
'అంతర్జాతీయ క్రికెట్లో పాక్ లో ఆటడానికి ఏ జట్టూ ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఇంగ్లండ్ జట్టు పాక్లో పర్యటనను తిరస్కరించింది. అదే జట్టు బంగ్లాదేశ్ పర్యటను ఆసక్తి కనబరుస్తోంది. ఈ వివాదాన్ని ఐసీసీ ముందు పెడతాం. ఇలా పాక్ లో ఏ దేశమూ పర్యటించకపోవడంతో చాలా నష్టపోతున్నాం. మాపైనే ఇంత నిర్దయ ఎందుకు. దీనిపై ప్రత్యేక పరిహారం ఇప్పించాలి. వచ్చే ఫిబ్రవరిలో జరిగే పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) నాటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాం' అని షహర్యార్ తెలిపారు.