Shahryar Khan
-
భారత్ చర్యలతో పాకిస్తాన్‌కు ఎంతో కష్టం!
కేప్ టౌన్: జమ్మూలోని ఉడీలో భారత ఆర్మీపై పాకిస్తాన్ ఉగ్రదాడుల అనంతరం ఎన్నో పర్యాయాలు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఉడీ ఉగ్రదాడి పాక్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టాన్ని కలిగించే అంశమని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా పాక్ అధికారులు భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బీసీసీఐ, ఐసీసీలతో పలుమార్లు చర్చించింది. ఈ విషయంపై వస్తున్న వదంతులపై దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఐసీసీ కౌన్సిల్ సమావేశంలో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇరుదేశాల మధ్య సిరీస్‌ల కోసం పాక్, భారత్‌ను అడుక్కోవడం లేదన్నారు. తమతో సిరీస్‌లు ఆడేందుకు భారత్ నిరాకరించడం వల్ల పీసీబీ ఎంతో ఆదాయాన్ని కోల్పోతుందని, ఆర్థికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయని షహర్యార్ ఖాన్ చెప్పారు. భారత్-పాక్ మధ్య సిరీస్‌లు జరగాలని మాత్రం మర్యాదపూర్వకంగానే బీసీసీఐతో పాటు ఐసీసీని సంప్రదించినట్లు ఆయన తెలిపారు. 2015-2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని పీసీబీ భావించింది. కానీ ఉగ్రదాడుల అనంతరం కేంద్ర ప్రభుత్వంగానీ, బీసీసీఐగానీ ఈ సిరీస్‌లపై ఆసక్తి చూపించడంలేదు. చివరగా 2007లో భారత్‌లో ఇరుదేశాలు మధ్య సిరీస్ జరిగిన విషయాన్ని షహర్యార్ ఖాన్ గుర్తుచేశారు. షహర్యార్ ఖాన్ ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల 17న ఏసీసీ చైర్మన్‌గా తొలి సమావేశంలో ఆయన పాల్గొని, దాయాది దేశాల మధ్య సయోధ్య కుదిర్చే యోచనలో ఉన్నారు. -
మాపై ఇంత నిర్దయ ఎందుకు?
లండన్: గత ఏడేళ్లుగా పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపడం లేదు. దీనిపై పీసీబీ ముమ్మర యత్నాలు చేస్తున్నా అవి ఆశాజనకంగా ఉండటం లేదు. 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత మరే దేశం ఆ దేశంలో అడుగుపెట్టేందుకు ముందడుగు వేయలేదు. దీంతో పాకిస్తాన్ తమ స్వదేశీ మ్యాచ్‌లను ఆడేందుకు యూఏఈను ఎంచుకుంటుంది. ఈ నేపథ్యంలో పీసీబీ ఆదాయానికి తీవ్రంగా గండిపడుతుంది. తాజాగా బంగ్లాదేశ్ లో పర్యటించడానికి ఇంగ్లండ్ జట్టు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ అంశాన్ని పాకిస్తాన్ తీవ్రంగా పరిగణించింది. గతంలో భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి నిరాకరించిన ఇంగ్లండ్.. ఇప్పుడు వరుస దాడులతో విలవిల్లాడుతున్న బంగ్లాదేశ్‌లో ఆడటానికి ఈసీబీ(ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) ఎలా సానుకూలంగా స్పందించాల్సి వచ్చిందో చెప్పాలంటూ పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రశ్నించారు. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వద్ద పంచాయితీ పెడతామని హెచ్చరించారు. ఈ సెక్యూరిటీ కారణాలు చూపెట్టి తమ దేశ పర్యటనకు మొగ్గు చూపని ఇంగ్లండ్.. అదే సెక్యూరిటీ కారణాలను బంగ్లాదేశ్ పర్యటించేటప్పుడు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. దీనిపై తమకు ప్రత్యేక పరిహారం ఇప్పించాలని ఐసీసీని షహర్యార్ డిమాండ్ చేశారు. 'అంతర్జాతీయ క్రికెట్లో పాక్ లో ఆటడానికి ఏ జట్టూ ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటనను తిరస్కరించింది. అదే జట్టు బంగ్లాదేశ్ పర్యటను ఆసక్తి కనబరుస్తోంది. ఈ వివాదాన్ని ఐసీసీ ముందు పెడతాం. ఇలా పాక్ లో ఏ దేశమూ పర్యటించకపోవడంతో చాలా నష్టపోతున్నాం. మాపైనే ఇంత నిర్దయ ఎందుకు. దీనిపై ప్రత్యేక పరిహారం ఇప్పించాలి. వచ్చే ఫిబ్రవరిలో జరిగే పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) నాటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాం' అని షహర్యార్ తెలిపారు. -
'నన్ను నవాజ్ షరీఫ్ కొనసాగమన్నారు'
కరాచీ: తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా తిరిగి కొనసాగడానికి ప్రధాని నవాజ్ షరీఫ్ కారణమని షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. ఇటీవల పాక్ క్రికెట్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయం తీసుకున్నా, నవాజ్ షరీఫ్ కారణంగా తిరిగా ఆ పదవిలో కొనసాగుతున్నానని షహర్యార్ అన్నారు. ' కొన్ని రోజుల క్రితం లండన్‌లో ప్రధాని షరీఫ్‌ను కలిసా. పాక్ క్రికెట్ బోర్డుకు సంబంధించి అనేక విషయాలు చర్చించాం. దానిలో భాగంగానే వచ్చే ఏడాది ఆగస్టు వరకు పాక్ క్రికెట్ చైర్మన్ గా నన్నే కొనసాగమన్నారు. అందుచేత అంగీకరించక తప్పలేదు' అని షహర్యార్ అన్నారు. ఇదిలా ఉండగా, పాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజీమ్ సేథీతో తనకు చిరకాల బంధం ఉందన్నారు. తనకు నజీమ్ సేథీ అత్యంత సన్నిహితుడని ఈ సందర్బంగా షహర్యార్ తెలిపారు. తామిద్దరం సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటామన్నాడు. అయితే చైర్మన్‌గా తుది నిర్ణయం మాత్రం తనదేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'కోచ్ నియామకంపై రాద్దాంతం తగదు'
కరాచీ: దాదాపు పదేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నదక్షిణాఫ్రికా మాజీ కోచ్ మికీ ఆర్థర్‌ను పాకిస్తాన్ కోచ్ గా ఎలా నియమిస్తారంటూ తలెత్తిన విమర్శలపై పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పందించారు. ఆర్థర్ పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు గతమని, అతన్ని ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ కోచ్ గా నియమించడంలో ఎటువంటి తప్పిదం జరగలేదంటూ సమర్ధించారు. గతంలో ఆర్థర్‌పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై అతను అప్పుడే వివరణ ఇచ్చిన సంగతిని షహర్యార్ గుర్తు చేశారు. ఒక ముగిసి పోయి కథను తిరిగి పదే పదే ఎత్తి చూపుతూ రాద్దాంతం చేయడం తగదన్నారు. 'ఆర్థర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలపై 2009లోనే పీసీబీ వివరణ తీసుకుంది. ఆ సమయంలో మూడు పేజీల లీగల్ నోటీసును ఆర్థర్ కు పంపడం, దానికి అతను సమాధానం చెప్పడం జరిగాయి. మరి అటువంటప్పుడు ఆర్థర్ కోచ్ గా సరైన వ్యక్తి కాదంటూ విమర్శలు చేయడం తగదు'అని షహర్యార్ అన్నాడు. ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఒక జట్టుకు కోచ్ గా ఆర్థర్ పని చేస్తున్నవిషయాన్ని షహర్యార్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు గాడిలో పడి మంచి ఫలితాలను సాధించడమే తమ లక్ష్యమని షహర్యార్ స్పష్టం చేశారు. 2007లో పాకిస్తాన్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్ ను అప్పటి సఫారీల కోచ్ గా ఉన్న ఆర్థర్ ఫిక్స్ చేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ కోచ్ గా అతని నియమాకాన్ని పలువురు తప్పుబడుతున్నారు. -
వరల్డ్‌కప్ లో పాల్గొనకపోతే.. ఫైన్ కట్టాలి!
కరాచీ:వచ్చే నెలలో భారత్‌లో జరుగనున్న వరల్డ్ టీ20లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాల్గొనడంపై ఇంకా నీలినీడలు వీడలేదు. ఆ దేశ ప్రభుత్వం నుంచి పీసీబీకి ఇంకా అనుమతి రాకపోవడంతో ఏం చేయాలనేది దానిపై అక్కడి క్రికెట్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ వరల్డ్ కప్ లో పాల్గొనడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే మాత్రం అంతర్జాతీయ క్రికెట మండలి(ఐసీసీ)కి ఫైన్ కట్టాల్సి వస్తుందని పీసీబీ చైర్మన్ షహర్యార్ తాజాగా స్పష్టం చేశారు. లాహోర్ లో మీడియాతో మాట్లాడిన షహర్యార్.. వరల్డ్ కప్ కు రోజులు దగ్గరపడుతున్న తరుణంలో తమ క్రికెట్ జట్టుకు అనుమతిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదే విషయంపై ప్రధాని మంత్రి సెక్రటరియేట్ లో మరోసారి చర్చించినట్లు షహర్యార్ తెలిపారు. తమ జట్టు వరల్డ్ కప్ లో పాల్గొనడానికి నిరాకరిస్తే ఐసీసీ నుంచి న్యాయపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి వస్తుందన్న కారణం చేత ఆ టోర్నీకి ప్రధాని కార్యాలయం నుంచి క్లియరెన్స్ లభించినట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తమ పర్యటన నిర్ణయం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని షహర్యార్ అన్నారు. వరల్డ్ టీ 20 పాల్గొంటామనే ఆశాభావం వ్యక్తం చేశారు. కానిపక్షంలో ఐసీసీకి జరిమానా కట్టాల్సిందేనని షహర్యార్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
దావూద్ ఇబ్రహీం పాక్ లో లేడు!
భారత దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై పాకిస్థాన్ తొలిసారి నోరు విప్పింది. గతంలో దావూద్ పాకిస్థాన్ లో తల దాచుకున్నది వాస్తవమేనని.. ప్రస్తుతం యూఏఈలో ఉండవచ్చని పాక్ ప్రత్యేక రాయబారి షార్యార్ ఖాన్ వెల్లడించారు. ఒకవేళ పాకిస్థాన్ లో ఉంటే తాము అరెస్ట్ చేయాడానికైన వెనకాడబోమని ఆయన అన్నారు. అంతేకాకుండా దావూద్ లాంటి గ్యాంగ్ స్టర్ తమ దేశం నుంచి వ్యవహారాలను నడపడానికి అనుమతించమని అన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన క్రికెట్ కాల్ డ్రన్: ద టర్బలెంట్ పాలిటిక్స్ ఏవ స్పోర్ట్స్ ఇన్ పాకిస్థాన్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో షార్యార్ ఖాన్ పాల్గొన్నాడు. పాకిస్థాన్ తోపాటు ఇతర దేశాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించే క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతున్న కారణంగానే దావూద్ పాకిస్థాన్ వదలి వెళ్లి ఉండచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.