వరల్డ్కప్ లో పాల్గొనకపోతే.. ఫైన్ కట్టాలి!
కరాచీ:వచ్చే నెలలో భారత్లో జరుగనున్న వరల్డ్ టీ20లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాల్గొనడంపై ఇంకా నీలినీడలు వీడలేదు. ఆ దేశ ప్రభుత్వం నుంచి పీసీబీకి ఇంకా అనుమతి రాకపోవడంతో ఏం చేయాలనేది దానిపై అక్కడి క్రికెట్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ వరల్డ్ కప్ లో పాల్గొనడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే మాత్రం అంతర్జాతీయ క్రికెట మండలి(ఐసీసీ)కి ఫైన్ కట్టాల్సి వస్తుందని పీసీబీ చైర్మన్ షహర్యార్ తాజాగా స్పష్టం చేశారు. లాహోర్ లో మీడియాతో మాట్లాడిన షహర్యార్.. వరల్డ్ కప్ కు రోజులు దగ్గరపడుతున్న తరుణంలో తమ క్రికెట్ జట్టుకు అనుమతిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదే విషయంపై ప్రధాని మంత్రి సెక్రటరియేట్ లో మరోసారి చర్చించినట్లు షహర్యార్ తెలిపారు.
తమ జట్టు వరల్డ్ కప్ లో పాల్గొనడానికి నిరాకరిస్తే ఐసీసీ నుంచి న్యాయపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి వస్తుందన్న కారణం చేత ఆ టోర్నీకి ప్రధాని కార్యాలయం నుంచి క్లియరెన్స్ లభించినట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తమ పర్యటన నిర్ణయం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని షహర్యార్ అన్నారు. వరల్డ్ టీ 20 పాల్గొంటామనే ఆశాభావం వ్యక్తం చేశారు. కానిపక్షంలో ఐసీసీకి జరిమానా కట్టాల్సిందేనని షహర్యార్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.