భారత్ చర్యలతో పాకిస్తాన్‌కు ఎంతో కష్టం!
కేప్ టౌన్: జమ్మూలోని ఉడీలో భారత ఆర్మీపై పాకిస్తాన్ ఉగ్రదాడుల అనంతరం ఎన్నో పర్యాయాలు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఉడీ ఉగ్రదాడి పాక్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టాన్ని కలిగించే అంశమని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా పాక్ అధికారులు భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బీసీసీఐ, ఐసీసీలతో పలుమార్లు చర్చించింది. ఈ విషయంపై వస్తున్న వదంతులపై దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఐసీసీ కౌన్సిల్ సమావేశంలో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇరుదేశాల మధ్య సిరీస్‌ల కోసం పాక్, భారత్‌ను అడుక్కోవడం లేదన్నారు.
తమతో సిరీస్‌లు ఆడేందుకు భారత్ నిరాకరించడం వల్ల పీసీబీ ఎంతో ఆదాయాన్ని కోల్పోతుందని, ఆర్థికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయని షహర్యార్ ఖాన్ చెప్పారు. భారత్-పాక్ మధ్య సిరీస్‌లు జరగాలని మాత్రం మర్యాదపూర్వకంగానే బీసీసీఐతో పాటు ఐసీసీని సంప్రదించినట్లు ఆయన తెలిపారు. 2015-2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని పీసీబీ భావించింది. కానీ ఉగ్రదాడుల అనంతరం కేంద్ర ప్రభుత్వంగానీ, బీసీసీఐగానీ ఈ సిరీస్‌లపై ఆసక్తి చూపించడంలేదు. చివరగా 2007లో భారత్‌లో ఇరుదేశాలు మధ్య సిరీస్ జరిగిన విషయాన్ని షహర్యార్ ఖాన్ గుర్తుచేశారు. షహర్యార్ ఖాన్ ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల 17న ఏసీసీ చైర్మన్‌గా తొలి సమావేశంలో ఆయన పాల్గొని, దాయాది దేశాల మధ్య సయోధ్య కుదిర్చే యోచనలో ఉన్నారు.