'కోచ్ నియామకంపై రాద్దాంతం తగదు'
కరాచీ: దాదాపు పదేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నదక్షిణాఫ్రికా మాజీ కోచ్ మికీ ఆర్థర్ను పాకిస్తాన్ కోచ్ గా ఎలా నియమిస్తారంటూ తలెత్తిన విమర్శలపై పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పందించారు. ఆర్థర్ పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు గతమని, అతన్ని ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ కోచ్ గా నియమించడంలో ఎటువంటి తప్పిదం జరగలేదంటూ సమర్ధించారు. గతంలో ఆర్థర్పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై అతను అప్పుడే వివరణ ఇచ్చిన సంగతిని షహర్యార్ గుర్తు చేశారు. ఒక ముగిసి పోయి కథను తిరిగి పదే పదే ఎత్తి చూపుతూ రాద్దాంతం చేయడం తగదన్నారు.
'ఆర్థర్పై ఫిక్సింగ్ ఆరోపణలపై 2009లోనే పీసీబీ వివరణ తీసుకుంది. ఆ సమయంలో మూడు పేజీల లీగల్ నోటీసును ఆర్థర్ కు పంపడం, దానికి అతను సమాధానం చెప్పడం జరిగాయి. మరి అటువంటప్పుడు ఆర్థర్ కోచ్ గా సరైన వ్యక్తి కాదంటూ విమర్శలు చేయడం తగదు'అని షహర్యార్ అన్నాడు. ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఒక జట్టుకు కోచ్ గా ఆర్థర్ పని చేస్తున్నవిషయాన్ని షహర్యార్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు గాడిలో పడి మంచి ఫలితాలను సాధించడమే తమ లక్ష్యమని షహర్యార్ స్పష్టం చేశారు. 2007లో పాకిస్తాన్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్ ను అప్పటి సఫారీల కోచ్ గా ఉన్న ఆర్థర్ ఫిక్స్ చేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ కోచ్ గా అతని నియమాకాన్ని పలువురు తప్పుబడుతున్నారు.