కరాచీ: ‘నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్‌కప్‌కు పాక్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టుగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే లక్ష్యంగా ముందుకెళతాం. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో చర్యలకు శ్రీకారం చుడతాం. ఎక్కడైతే టాలెంట్ ఉందో వారిని కచ్చితంగా సానబెడతాం. ఇక నుంచి పాక్ క్రికెట్ జట్టు ఎలా ఉండాలనేది నేను సెట్ చేస్తా. పాక్ జట్టు ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్లాలని నేను డిసైడ్ అయ్యా’ అని మాజీ క్రికెటర్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్‌కు చేరకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్ పై విధంగా స్పందించారు.
కాగా, తాజా పరిస్థితుల్ని బట్టి చూస్తే పాక్ క్రికెట్‌లో ఇమ్రాన్ ఖాన్ ‘గేమ్’ మొదలైనట్లే కనబడుతోంది. మొన్నటి వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన మికీ ఆర్థర్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీబీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆర్థర్‌కు ఉద్వాసన చెప్పడానికి ఇమ్రానే ప్రధాన కారణమట. మరో రెండేళ్ల పాటు ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని పీసీబీ పెద్దలు భావించినప్పటికీ ఇమ్రాన్ జోక్యంతో అతనికి స్వస్తి పలికాల్సివచ్చిందట. దాంతో సపోర్టింగ్ స్టాఫ్‌ను కూడా తొలగించడానికి ఇమ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను మరో రెండేళ్ల పాటు ప్రధాన కోచ్‌గా కొనసాగించాలని ఆర్థర్ విన్నవించినప్పటికీ దాన్ని పీసీబీ తిరస్కరించడంతో పాక్ క్రికెట్ ప్రక్షాళనను ఇమ్రాన్ సీరియస్‌గానే తీసుకున్నారనే దానికి నిదర్శనంగా కనబడుతోంది.
స్వదేశీ కోచ్‌వైపే మొగ్గు
ప్రస్తుత పరిణామాల్ని బట్టి చూస్తే విదేశీ కోచ్ ఎంపికకు పీసీబీ సానుకూలంగా లేదు. విదేశీ కోచ్ కంటే కూడా స్వదేశీ క్రికెటర్‌నే కోచ్‌గా ఎంపిక చేయాలనే యోచనలో పీసీబీ ఉంది. మికీ ఆర్థర్ పర్యవేక్షణలో పాక్ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంపై స్వదేశీ కోచ్ ఎంపికకు ఎక్కువ మొగ్గు కనబడుతోంది. ఈ రేసులో పాక్ మాజీ క్రికెటర్లు మొహిసిన్ ఖాన్, మిస్బావుల్ హక్‌లు ఉన్నారు. వీరిలో మిస్బావుల్ హక్ ముందు వరుసలో ఉండగా, మొహిసిన్ ఖాన్ కూడా ప్రధాని కోచ్ పదవిపై ధీమాగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment