
కనేరియాపై పీసీబీ సీరియస్
కరాచీ: తాను హిందువును కావడం వల్లే తమ దేశ క్రికెట్ బోర్డు సాయం చేయలేదన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలపై పీసీబీ సీరియస్ అయ్యింది. ప్రధానంగా పీసీబీని అస్త్రంగా చేసుకుని కనేరియా చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదని బోర్డు మీడియా డైరెక్టర్ అమ్ జాద్ హుస్సేన్ భట్టి ఖండించారు. ఒకవేళ అది గనుక జరిగి ఉంటే పాకిస్తాన్ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం వచ్చేది కాదన్న విషయాన్ని కనేరియా గుర్తిస్తే బాగుంటుందని విమర్శించారు.
'మమ్ముల్ని కనేరియా ప్రకటన నిరాశకు గురి చేసింది. అతన్ని పాకిస్తాన్ క్రికెట్ ఏమీ నిషేధించలేదు. ఇంగ్లిష్ కౌంటీల్లో ఫిక్సింగ్ పాల్పడటంతో ఇంగ్లండ్ నిషేధించింది. ఐసీసీలో ఇంగ్లండ్ సభ్యదేశం కాబట్టే నీపై నిషేధం అమల్లో ఉంది. దీనిపై పోరాటం చేయడం మాని, అనేక మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చిన పీసీబీని విమర్శిస్తావా?, అలా అనుకుంటే నీకు పాకిస్తాన్ జట్టులో ఆడే అవకాశమే ఉండేది కాదు' అని హుస్సేన్ తీవ్రంగా మండిపడ్డారు. పాక్ తరపున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన తరువాత కనేరియా మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజమన్నారు. పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పుడు హిందువుగానే జట్టులో ఆడావన్న సంగతి కనేరియా గుర్తించుకుంటే మంచిందన్నారు.
2012 ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కనేరియా జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. దీనిలో భాగంగా తమకు రూ. 2.5 కోట్లు చెల్లించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆదేశించడంతో కనేరియా మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. గతంలో దీనిపై బీసీసీఐని కూడా ఆశ్రయించాడు. తనకు న్యాయ సహాయం అందించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, తాజాగా పీసీబీపై కనేరియా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉండటంతో అతని పరిస్థితి మరింత ఇరకాటంలో పడింది.