
పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది
మూత్ర నాళ సంబంధ (యూరినరీ ట్రాక్) ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు.
వెల్లడించిన డాక్టర్లు
సావో పాలో: మూత్ర నాళ సంబంధ (యూరినరీ ట్రాక్) ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. యాంటీబయాటిక్స్‌కు బాగా స్పందిస్తున్నారన్నారు. ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోనే ఉన్న 74 ఏళ్ల పీలేకు తాత్కాలిక కిడ్నీ చికిత్స అందిస్తున్నాం.
అయితే ఇతర పరికరాల సాయం లేకుండా శ్వాస, ఆహారం సాధారణంగానే తీసుకుంటున్నారు. ఓవరాల్‌గా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైంది’ అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. 1970లో పక్కటెముక విరగడంతో తలెత్తిన సమస్యల నుంచి పీలేను కాపాడేందుకు ఓ మూత్రపిండాన్ని తొలగించారని అతని వ్యక్తిగత సలహాదారు జోస్ ఫోర్నోస్ రోడ్రిగ్వేజ్ చెప్పారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న చికిత్సకు దానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.