ఏడాదికి రూ. 1235 కోట్లు!
బార్సిలోనా: ‘ఫిఫా’ అత్యుత్తమ ఆటగాడిగా ఈ ఏడాది అవార్డు సొంతం చేసుకున్న పోర్చుగల్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో వ్యక్తిగతంగా మరో ఘనతను సాధించాడు. ఫుట్‌బాల్ ప్రపంచంలో ఈ ఏడాది సంపన్నమైన క్రీడాకారుడిగా రొనాల్డో నిలిచాడు. తాజా లెక్కల ప్రకారం అతని సంపాదన సంవత్సరానికి 122 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1235 కోట్లు)గా ఉంది.
ఈ జాబితాలో గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లండ్ దిగ్గజం బెక్‌హామ్‌ను (రిటైర్ కావడం వల్ల) పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది రియల్ మాడ్రిడ్‌తో 76 మిలియన్ పౌండ్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు నైకీ తదితర సంస్థల స్పాన్సర్‌షిప్‌తో రొనాల్డో భారీగా ఆర్జిస్తున్నాడు. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ 120.5 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1220 కోట్లు)తో రెండో స్థానంలో ఉన్నాడు. సామ్యూల్ ఇటో, వేన్ రూనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.