క్విటోవా, డెల్ పొట్రోలకు షాక్ | Petra Kvitova,Del potro shock | Sakshi
Sakshi News home page

క్విటోవా, డెల్ పొట్రోలకు షాక్

Published Sun, Sep 1 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

క్విటోవా, డెల్ పొట్రోలకు షాక్

క్విటోవా, డెల్ పొట్రోలకు షాక్

న్యూయార్క్:  సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఆరో రోజు అగ్రశ్రేణి క్రీడాకారులకు కలసిరాలేదు. పురుషుల సింగిల్స్‌లో 2009 చాంపియన్, ఆరో సీడ్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్‌లో... మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), 14వ సీడ్ మరియా కిరిలెంకో (రష్యా), 2004 చాంపియన్, 27వ సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) మూడో రౌండ్‌లో ఇంటిదారి పట్టారు.
 
 చాలా రోజుల తర్వాత ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాడు. 2001 యూఎస్ చాంపియన్ హెవిట్ రెండో రౌండ్‌లో 6-4, 5-7, 3-6, 7-6 (7/2), 6-1తో డెల్ పొట్రో (అర్జెంటీనా)ను బోల్తా కొట్టించాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో అన్‌సీడెడ్ అలీసన్ రిస్కీ (అమెరికా) 6-3, 6-0తో ప్రపంచ 10వ ర్యాంకర్ క్విటోవాపై; సిమోనా హలెప్ (రుమేనియా) 6-1, 6-0తో కిరిలెంకోపై; ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 7-5, 6-1తో కుజ్‌నెత్సోవాపై సంచలన విజయాలు సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
 
 డెల్ పొట్రోతో 4 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హెవిట్ దూకుడుగా ఆడి తన పాతరోజులను గుర్తుకు తెచ్చాడు. తరచూ గాయాల బారిన పడి ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 66వ స్థానంలో ఉన్న 32 ఏళ్ల ఈ వింబుల్డన్ మాజీ చాంపియన్ కెరీర్‌లో 32వ సారి ఐదు సెట్‌ల మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేశాడు. 2006 తర్వాత తొలిసారి యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించిన డెల్ పొట్రో ఏకంగా 70 అనవసర తప్పిదాలు, 8 డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
 
  కెరీర్‌లో 13వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతోన్న హెవిట్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను 8 సార్లు బ్రేక్ చేశాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/2), 6-2, 6-2తో బెంజమిన్ బెకర్ (జర్మనీ)పై, మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 7-5, 6-1, 3-6, 6-1తో లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)పై, ఐదో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 7-6 (7/3), 7-6 (7/3), 6-3తో డెనిస్ కుడ్లా (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-5, 7-6 (10/8), 6-4తో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై, 12వ సీడ్ టామీ హాస్ (జర్మనీ) 6-3, 6-4, 7-6 (7/3)తో యెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గి మూడో రౌండ్‌కి చేరారు.
 
 లిసికి పరాజయం
 మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) మూడో రౌండ్‌లోనే ఓడిపోయింది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన లిసికి 4-6, 5-7తో 24వ సీడ్ మకరోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-3, 6-1తో యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement