వండర్...లియాండర్!
సాక్షి క్రీడా విభాగం
ఇటీవలి కాలంలో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అంశం తరచూ వార్తల్లో నిలిచింది. 40 ఏళ్ల వయసు... 24 ఏళ్ల కెరీర్‌లో ఇంకా సాధించేది ఏముందంటూ చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయితే ఈ గోలకు దూరంగా మరో నాలుగు పదుల భారత ‘కుర్రాడు’ అంతర్జాతీయ క్రీడా రంగంపై తన సత్తా చూపించాడు. సాధించాలన్న తపనే ఉంటే వయసుతో పని లేకుండా ఏం చేసి చూపించవచ్చో నిరూపించాడు. అతనే టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్. గత 22 ఏళ్లుగా భారత క్రీడాభిమానులను అలరిస్తూ ఇప్పటికీ వన్నె తగ్గని ఈ యోధుడు మరిన్ని విజయాలకు సిద్ధమయ్యాడు.
30 ఫైనల్స్...
1990లో జూనియర్ వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గి అందరి దృష్టినీ ఆకర్షించిన పేస్, తర్వాతి ఏడాది నుంచి సీనియర్ స్థాయిలో ప్రొఫెషనల్ ఆటగాడిగా అడుగు పెట్టాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించినా.... తొందరగానే పేస్ తన సింగిల్స్ లోపాలను పసిగట్టాడు. అందులో ఎదగలేనని భావించి డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌పైనే దృష్టి సారించాడు. ఫలితంగా అతను కెరీర్‌లో మరింత వేగంగా దూసుకుపోయాడు. ఏకంగా 14 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో విజేతగా నిలిచి సగర్వంగా నిలబడ్డాడు. 30 గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్‌కు చేరిన అతను మూడు దశాబ్దాల్లోనూ (1990, 2000, 2010) టైటిల్స్ నెగ్గిన అరుదైన ఘనతను అందుకున్నాడు. 40 ఏళ్ల వయసులోనూ ట్రోఫీని అందుకొని ఎక్కువ వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
దేశం కోసం...
ఏటీపీ సర్క్యూట్‌లో బిజీ షెడ్యూల్, సొంత ఒప్పందాలు... ఇలా ఎన్ని ఉన్నా దేశం కోసం ఆడటానికి పేస్ ఎప్పుడైనా రెడీ. ఇంకా చెప్పాలంటే వ్యక్తిగతంగా కంటే భారత్ తరఫున ఆడినప్పుడు పేస్‌లో కొత్త జోష్ కనిపిస్తుంది. డేవిస్ కప్‌లో సర్వ శక్తులు ఒడ్డి పోరాడటంలో లియాండర్ తర్వాతే ఎవరైనా. భారత్‌కు ఎన్నో అనూహ్య విజయాలు అందించిన అతనికి ఈ టోర్నీలో 86-31 రికార్డు ఉంది.
ట్యూమర్‌ను అధిగమించి...
2003లో ఆటలో దూసుకుపోతున్న సమయంలో పేస్‌ను ‘న్యూరోసిస్టిసెర్కోసిస్’ పేరు గల బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకింది. దాంతో కొంత కాలం ఆటకు దూరమైన పేస్, తర్వాత కోలుకొని పట్టుదలగా మళ్లీ రాకెట్ చేతపట్టాడు. తొలినాటి జోరు తగ్గి కొన్ని అపజయాలు ఎదురైనా వాటికి తన ఆటతోనే సమాధానం చెప్పాడు. దిగ్గజ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవాతో భాగస్వామిగా ఆడటం ఈ భారత ఆటగాడి కెరీర్‌ను మరింత తీర్చి దిద్దింది. గత ఏడాది డబుల్స్‌లో కెరీర్ స్లామ్ పూర్తి చేసి భారత ఆల్‌టైమ్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇప్పటికే ఆరు ఒలింపిక్స్ ఆడిన పేస్ (1992-2012) వచ్చే 2016 రియో ఒలింపిక్స్‌కు కూడా సిద్ధమని ప్రకటించాడు.
కెరీర్‌లో 5 అత్యుత్తమ క్షణాలు
అట్లాంటా ఒలింపిక్స్ (1996)లో కాంస్యం. 1952 తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం నెగ్గిన ఘనత సొంతం చేసుకున్నాడు. సెమీస్‌లో పేస్‌పై నెగ్గిన అనంతరం ఆండ్రీ అగస్సీ తన పుస్తకంలో పేస్ ఆటను ప్రత్యేకంగా ప్రశంసించాడు.
1998లో పైలట్ పెన్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో అమెరికా దిగ్గజం పీట్ సంప్రాస్‌పై 6-3, 6-4తో నెగ్గి సంచలనం సృష్టించాడు.
1999లో మహేశ్ భూపతితో కలిసి నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లకు చేరగా ఫ్రెంచ్, వింబుల్డన్‌లో విజేతగా నిలిచారు. అనంతరం వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ దక్కింది.
2012లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గడంతో డబుల్స్‌లో కెరీర్ స్లామ్ పూర్తయింది.
1990లో ప్రపంచ జూనియర్ వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్‌తో పాటు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ (జూనియర్).
ఆసక్తికర సంగతులు...
కోల్‌కతా అభిమాన క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో తరచూ గాయాలవుతుండటంతో అతని తండ్రి వేస్ పేస్ టెన్నిస్ వైపు మళ్లించాడు.
జూనియర్ ఆటగాడిగా ఉన్నప్పుడు రాడ్ లేవర్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి హాజరయ్యాడు. టెన్నిస్ ఎక్విప్‌మెంట్‌కు గౌరవం ఇవ్వాలని లేవర్ చెప్పిన మాటను అతను ఇప్పటికీ పాటిస్తాడు.
డబుల్స్‌లో పేస్ ఇప్పటికి 94 మంది వేర్వేరు భాగస్వాములతో ఆడాడు. తన 100వ భాగస్వామి ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉంటాడని అతను ప్రకటించాడు.
డేవిస్ కప్‌లో పేస్ తొలి భాగస్వామి జీషాన్ అలీ కాగా...94వ భాగస్వామి అయిన సనమ్ సింగ్‌కు పేస్ ఒలింపిక్స్ (1996)లో పతకం నెగ్గినపుడు ఏడేళ్లు.
డేవిస్‌కప్‌లో పేస్-భూపతిలది 1997నుంచి అద్భుతమైన రికార్డు ఉంది. వీరిద్దరు జోడిగా ఆడి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు.
ప్రతి రోజూ ధ్యానం చేసే అలవాటున్న పేస్‌కు స్ట్రీట్ జాజ్ డాన్సింగ్‌లో మంచి పట్టు ఉంది.
హిందీ చిత్రం ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’లో పేస్ కీలక పాత్ర పోషించాడు.
మార్టినాతో ఆడే సమయంలో ఆమె కెరీర్ చరమాంకంలో పేస్ కొన్ని స్ఫూర్తినిచ్చే సందేశాలు రాసి ఆమె టెన్నిస్ బ్యాగ్‌లో వేసేవాడు.