చరిత్ర సృష్టించిన లియాండర్ పేస్
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్, స్విట్జర్లాండ్ భామ మార్టినా హింగిస్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. ఒకే ఏడాది మూడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గి, పేస్-హింగిస్ జోడీ చరిత్ర సృష్టించింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామున జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో పేస్-హింగిస్ ద్వయం 6-4, 3-6, 10-7 తేడాతో అమెరికా జోడీ సామ్ కెర్రీ - బెథానీ మాటెక్ లపై విజయం సాధించింది. ఈ ఏడాది వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లు కూడా కైవసం చేసుకున్న విషయం విదితమే.
తాజా విజయంతో 1969 తర్వాత ఓ క్యాలెండర్ ఏడాదిలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 3 గ్రాండ్ స్లామ్లు నెగ్గిన జంటగా పేస్-హింగిస్లు చరిత్ర సృష్టించారు. పేస్కు ఇది 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, స్విస్ స్టార్ మార్టినా హింగిస్ తన ఖాతాలో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. హింగిస్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించగా, అవన్నీ భారతీయ భాగస్వాములతోనే నెగ్గడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పేస్కు ఇది 9వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, అత్యధికంగా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఖాతాలో 10 టైటిల్స్ ఉన్నాయి. మరో టైటిల్ సాధిస్తే ఈ విభాగంలోనూ పేస్ తన రికార్డు మెరుగుపర్చుకునే అవకాశం ఉంది.