పేస్-హింగిస్ ‘మిక్స్‌డ్’ కెరీర్ స్లామ్
► ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఇండో-స్విస్ ద్వయం
► ఫైనల్లో సానియా-డోడిగ్ జోడీపై గెలుపు
పారిస్: వయసు పెరిగినా వన్నె తగ్గలేదని భారత, స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, మార్టినా హింగిస్ నిరూపించారు. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో పేస్-హింగిస్ జోడీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ పేస్-హింగిస్ జోడీ 4-6, 6-4, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయంపై విజయం సాధించింది. ఈ విజయంతో ఇటు పేస్... అటు హింగిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జతగా... వేర్వేరుగా కెరీర్ స్లామ్ (నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) ఘనతను పూర్తి చేసుకున్నారు. 42 ఏళ్ల పేస్‌కిది ఓవరాల్‌గా 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో పురుషుల డబుల్స్ విభాగంలో 8... మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో 10 ఉన్నాయి.
మరోవైపు 35 ఏళ్ల హింగిస్‌కు 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో మహిళల సింగిల్స్ విభాగంలో 5ు... మహిళల డబుల్స్‌లో 12... మిక్స్‌డ్ విభాగంలో 5 టైటిల్స్ ఉన్నాయి. విజేతగా నిలిచిన పేస్-హింగిస్ జంటకు లక్షా 16 వేల యూరోలు (రూ. 87 లక్షల 81 వేలు)... రన్నరప్ సానియా-డోడిగ్ జోడీకి 58 వేల యూరోలు (రూ. 43 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
సానియా-డోడిగ్ జంటతో జరిగిన ఫైనల్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. తొలి సెట్‌లో తొమ్మిది గేమ్‌ల వరుకు రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. అయితే పదో గేమ్‌లో పేస్ జంట సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమైన సానియా-డోడిగ్ ద్వయం సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో నాలుగో గేమ్‌లో సానియా-డోడిగ్ జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పేస్-హింగిస్ జంట 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆరో గేమ్‌లో పేస్ జంట సర్వీస్‌ను బ్రేక్ చేసి సానియా ద్వయం స్కోరును 3-3తో సమం చేసింది. కానీ ఏడో గేమ్‌లో సానియా జంట సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత తమ సర్వీస్‌ను కాపాడుకొని పేస్ ద్వయం 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అనంతరం పదో గేమ్‌లో తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6-4తో దక్కించుకుంది. ఇక నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో ప్రతి పాయింట్‌కూ రెండు జోడీలు పోరాడాయి. చివరకు అనుభవజ్ఞులైన పేస్-హింగిస్ జోడీ పైచేయి సాధించింది. గతేడాది హింగిస్‌తో కలిసి ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నె గ్గిన పేస్... ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి ‘కెరీర్ స్లామ్’ పూర్తి చేసుకున్నారు.