మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-4తో కరిన్ నాప్-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడీపై గెలిచింది. సరిగ్గా గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయినప్పటికీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
పేస్ జంటకు ఓటమి
పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో ఉన్న లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా); రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటలకు మూడో రౌండ్‌లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆరో సీడ్ ఫాబియో ఫాగ్‌నిని-సిమోన్ బోలెలి (ఇటలీ) ద్వయం 6-2, 6-4తో పేస్-నెస్టర్ జంటపై, ఐదో సీడ్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) ద్వయం 6-3, 6-7 (7/9), 6-3తో బోపన్న-మెర్జియా జోడీపై గెలిచాయి.
ప్రాంజలకు నిరాశ
జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్‌లో ప్రాంజల 6-7 (1/7), 4-6తో ప్రిస్కిల్లా హాన్ (ఆస్ట్రేలియా) చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోవడంతో పాటు కీలకదశలో తడబాటుకులోనైన ప్రాంజలకు పరాజయం తప్పలేదు.
క్వార్టర్స్‌లో సానియా-హింగిస్ జంట
Published Mon, Jun 1 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement