ఇటు సానియా... అటు పేస్
మార్టినా హింగిస్ జతగా మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన భారత స్టార్స్
న్యూయార్క్ : సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, లియాండర్ పేస్‌లు ‘డబుల్ ధమాకా’ సృష్టించే దిశగా మరో అడుగు ముందుకేశారు. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా... మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత జులైలో హింగిస్‌తో కలిసి సానియా, పేస్‌లు వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఇంకో రెండు విజయాలు సాధిస్తే హింగిస్ తన ఖాతా లో మరో రెండు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ట్రోఫీలను జమ చేసుకోనుంది.
మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-1తో సారా ఎరాని-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంటపై గెలిచింది. 77 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తొలి సెట్‌లో సానియా జంటకు కాస్త పోటీ ఎదురైనా, రెండో సెట్ మాత్రం ఏకపక్షంగా సాగింది. కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్); అనా లెనా గ్రోయెనిఫెల్డ్ (జర్మనీ)-కోకో వాండెవెగె (అమెరికా)ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సానియా-హింగిస్ జంట తలపడుతుంది.
మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-2, 7-5తో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో పేస్ ద్వయం మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌లో రెండుసార్లు, రెండో సెట్‌లో రెండుసార్లు బోపన్న జోడీ సర్వీస్‌లను బ్రేక్ చేసిన పేస్ జంట తమ సర్వీస్‌ను ఒక్కసారి కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి గం. 9.30 మొదలయ్యే ఫైనల్లో అన్‌సీడెడ్ జోడీ సామ్ క్వెరీ-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో పేస్-హింగిస్ జంట అమీతుమీ తేల్చుకుంటుంది.