మాంచెస్టర్: కేన్ విలియమ్సన్ (148) భారీ శతకంతో అదరగొట్టడంతో వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ మరో విజయం సాధించింది. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 291/8 స్కోరు చేసింది. కాట్రెల్ (4/56) కీలక వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో వెస్టిండీస్ జట్టు 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటై ఓడింది. బ్రాత్‌వైట్ అద్భుత సెంచరీ (82 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101)తో చివరిదాకా పోరాడినా విండీస్‌ను గెలిపించలేకపోయాడు. 7 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన తరుణంలో సిక్సర్‌కు ప్రయత్నించిన బ్రాత్‌వైట్ అవుటవడంతో విండీస్ ఆశలు వమ్మయ్యాయి. అయితే మ్యాచ్ తర్వాత బ్రాత్‌వైట్ పోరాట స్ఫూర్తిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అభినందించాడు.
ఇంకా ఓవర్ మిగిలి ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోవడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన బ్రాత్‌వైట్ పిచ్‌పైనే మోకాళ్లపై కాసేపు అలానే ఉండిపోయాడు. దాంతో బ్రాత్‌వైట్ వద్దకు చేరుకున్న విలియమ్సన్ ‘వెల్‌డన్.. వెల్ ప్లేయడ్’ అంటూ ఓదార్చాడు. విలియమ్సన్‌తో పాటు పలువురు కివీస్ సభ్యులు కూడా బ్రాత్‌వైట్‌ను ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో విలియమ్సన్‌తో పాటు కివీస్ సభ్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ‘ ఈ మ్యాచ్‌లో పరాజయం వెస్టిండీస్ గాయపరిస్తే.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటో మా హృదయాల్ని దోచుకుంది’ అని ఒక అభిమాని పేర్కొనగా, ‘ ఇది క్రీడా స్ఫూర్తి అంటే’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఒక సెంచరీ వీరుడ్ని మరొక సెంచరీ వీరుడు ఓదార్చుతున్నాడు’ అని మరొకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment