మా వ్యూహం ఫలించింది: శ్రీలంక క్రికెటర్
కొలంబో: భారత్ తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలిన శ్రీలంక జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో ఎలా ఆడాలనే దానిపై పూర్తిస్థాయి కసరత్తులు చేసిందట. ఫాలో ఆన్ ఆడటానికి ముందు వచ్చిన బ్రేక్ లో లంక ఆటగాళ్లు ప్రణాళిక బద్ధంగా బరిలోకి దిగి రాణించడానికి వ్యూహాలు రచించిందట. శనివారం 50/2 తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయులు.. అశ్విన్(5/69) ధాటికి 183 పరుగుల వద్ద తలవంచారు. అదే సమయంలో తొలి ఇన్నింగ్స్ లోటు 439 పరుగుల్ని ఎలా పూడ్చాలనే దానిపై తాము సుదీర్ఘంగా చర్చించినట్లు శ్రీలంక వికెట్ కీపర్ డిక్ వెల్లా వెల్లడించాడు.
'మా రెండో ఇన్నింగ్స్ వ్యూహం ఫలించింది. ఫాలో ఆన్ లో ఎలా ఆడాలో ప్రణాళికలు సిద్దం చేసుకుని బరిలోకి దిగాం. ప్రధానంగా అశ్విన్, జడేజాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కసరత్తు చేశాం. ఆ ఇద్దర్ని ఎదుర్కొనే క్రమంలో స్వీప్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాం. క్రీజ్ లో దిగాక అది చేసి చూపించాం. ఇక్కడ కోచ్ నుంచి సలహాలు తీసుకున్నాం. దాంతో రెండో ఇన్నింగ్స్ లో మారింది. ఇది స్పిన్నింగ్ వికెట్.. అందుచేత ఎక్కువగా స్వీప్ షాట్లు ఆడాం. అది పచ్చికతో ఉన్న పిచ్ ఎదురైతే స్వీప్ షాట్లను ఆడేవాళ్లం కాదు'అని డిక్ వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో కుశాల్ మెండిస్, కరుణరత్నేల జోడి 191 పరుగుల భాగస్వామ్యంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మెండిస్ చేసే క్రమంలో ఎక్కువగా స్వీప్ షాట్లతో అలరించాడు. అశ్విన్, జడేజాల బౌలింగ్ లో స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నాడు.