'సానియాకు ప్రధాని ప్రశంసల జల్లు'
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించి టైటిల్ సాధించిన నేపథ్యంలో వారిద్దరిపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. వారి క్రీడా ప్రతిభ దేశం గర్వించేలా ఉందంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
ప్రధాని ట్వీట్కు స్పందించిన సానియా కూడా తనకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. స్టిట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్తో కలిసి సానియా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. గత జులైలో హింగిస్‌తోనే కలిసి సానియా వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా యూఎస్ ఓపెన్ డబుల్స్లో విజేతగా నిలిచిన సానియా-హింగిస్‌లకు 5 లక్షల 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 77 లక్షలు) లభించింది. రన్నరప్ డెలాక్వా-ష్వెదోవా జోడీకి 2 లక్షల 75 వేల డాలర్లు (రూ. కోటీ 82 లక్షలు) దక్కాయి.