మహిళల ప్రపంచకప్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో భారత జట్టు ప్రదర్శన కనబర్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ...
మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచకప్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో భారత జట్టు ప్రదర్శన కనబర్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. గురువారం మిథాలీ రాజ్ బృందానికి ప్రధాని ఆతిథ్యం ఇచ్చారు. ‘అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళలు ఇటీవల అత్యుత్తమ ఫలి తాలు సాధిస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ జట్టు కూడా ప్రపంచకప్ ఫైనల్ వరకు చేరి అబ్బుర పరిచింది. ఆయా విభాగాల్లో మహిళలు సాధిస్తున్న ఈ పురోగతి దేశానికి మేలు చేస్తుంది’ అని మోదీ తెలిపారు. ఈ భేటీలో ఆయనకు తమ సంతకాలతో కూడిన బ్యాట్‌ను క్రికెటర్లు అందించారు.
అంతకుముందు భారత జట్టు గురువారమంతా తీరికలేని షెడ్యూల్‌తో బిజీబిజీగా గడిపింది. క్రీడా, రైల్వే శాఖలతో పాటు బీసీసీఐ ఆధ్వర్యంలో జట్టుకు ఘన సన్మానం జరిగింది. బీసీసీఐ జట్టు సభ్యులకు రూ.50 లక్షల చొప్పున... రైల్వే శాఖ ‘తమ’ క్రికెటర్లకు రూ.13 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. రైల్వేస్ తరఫున ఆడే భారత జట్టులోని 10 మంది క్రికెటర్లకు నేరుగా ప్రమోషన్ కూడా ఇచ్చింది. కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ప్రత్యేకంగా దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్ ‘బి’ గెజిటెడ్ ర్యాంక్ అయిన చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ (చీఫ్ ఓఎస్)గా ప్రమోషన్ దక్కింది.