పూరన్‌ మెరుపులు..పొలార్డ్‌ బాదుడు | Pooran, Pollard Set India 316 For Series Win | Sakshi
Sakshi News home page

పూరన్‌ మెరుపులు..పొలార్డ్‌ బాదుడు

Published Sun, Dec 22 2019 5:38 PM | Last Updated on Sun, Dec 22 2019 5:43 PM

Pooran, Pollard Set India 316 For Series Win - Sakshi

కటక్‌: టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్‌ 316 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఒకవైపు  నికోలస్‌ పూరన్‌ మెరుపులు మెరిపించగా,మరొకవైపు కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌ వీర బాదుడు బాదాడు. పూరన్‌(89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), పొలార్డ్‌(74 నాటౌట్‌; 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), షాయ్‌ హోప్‌(42;50 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. రోస్టన్‌ ఛేజ్‌(38), హెట్‌మెయిర్‌(37)లు ఫర్వాలేదనిపించడంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో విండీస్‌ బ్యాటింగ్‌ను లూయిస్‌, హోప్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల  జత చేసిన తర్వాత లూయిస్‌ ఔట్‌ కాగా, కాసేపటికి హోప్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. లూయిస్‌ను  జడేజా పెవిలియన్‌కు పంపగా, హోప్‌ను మహ్మద్‌ షమీ ఔట్‌ చేశాడు. ఆపై రోస్టన్‌ ఛేజ్‌కు హెట్‌మెయిర్‌ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ‍్యవధిలో చేజ్‌ను సైతం సైనీ  బౌల్డ్‌ చేశాడు. ఆ తరుణంలో నికోలస్‌ పూరన్‌కు జత కలిసిన పొలార్డ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. స్లాగ్‌ ఓవర్లలో ఈ జోడి ధాటిగా ఆడింది.

బౌండరీలే లక్ష్యంగా చెలరేగింది. ఫలితంగా స్కోరు బోర్డు పరుగులు తీసింది. ప్రధానంగా పూరన్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత రెచ్చిపోయి ఆడాడు. అతనికి పొలార్డ్‌ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ చక్కటి సమన్వయంతో విండీస్‌ స్కోరును గాడిలో పెట్టారు. కాగా, శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 48 ఓవర్‌ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన పూరన్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత హోల్డర్‌ క్రీజ్‌లోకి రాగా, పొలార్డ్‌ బ్యాట్‌ ఝుళిపించి ఆడాడు. ఈ జోడి చివరి రెండు ఓవర్లలో 32 పరుగుల్ని సాధించారు. ఇందులో 29 పరుగుల్ని పొలార్డ్‌ సాధించాడు. చివరి పది ఓవర్లలో 118 పరుగుల్ని విండీస్‌ పిండుకుంది. భారత బౌలర్లలో సైనీ రెండు వికెట్లు సాధించగా, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజాలకు తలో వికెట్‌ దక్కింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement