రోహిత్ శర్మ నాయకత్వంలో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌లో ఏకపక్ష విజయాలు సాధించిన భారత జట్టు టి20 సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించింది. మ్యాచ్ ఫార్మాట్, వేదిక మారడం మినహా ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తొలి మ్యాచ్ ఆడిన రవి బిష్ణోయ్ సహా బౌలర్లు రాణించడంతో ముందుగా ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ పునాదిపై సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది.
కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 61; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కైల్ మేయర్స్ (24 బంతుల్లో 31; 7 ఫోర్లు) రాణించాడు. తన తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థిని కట్టడి చేసిన రవి బిష్ణోయ్ (2/14) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 35; 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 జరుగుతుంది.
పూరన్ మినహా...
తొలి ఓవర్లోనే బ్రండన్ కింగ్ (4)ను అవుట్ చేసి విండీస్‌ను భువనేశ్వర్ దెబ్బ కొట్టాడు. అయితే ఎనిమిది బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టిన మేయర్స్, ఆపై భువీ, హర్షల్ పటేల్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. అయితే చహల్ మొదటి ఓవర్లోనే మేయర్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా... ఛేజ్ (4), రావ్‌మన్ పావెల్ (2) విఫలమయ్యారు. వీరిద్దరిని రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్‌లో పూరన్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చహల్ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లు బాదిన పూరన్ 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో కీరన్ పొలార్డ్ (19 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత ధాటిని ప్రదర్శించడంతో విండీస్ స్కోరు 150 పరుగులు దాటగలిగింది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు 61 పరుగులు సాధించింది.
శుభారంభం...
ఛేదనను భారత్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ముఖ్యంగా ఒడెన్ స్మిత్ వేసిన ఓవర్లో రోహిత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగాడు. పవర్‌ప్లే ముగిసేసరికే భారత్ స్కోరు 58 పరుగులకు చేరింది. అయితే తొలి వికెట్‌కు 45 బంతుల్లోనే 64 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ అవుటయ్యాడు. కొద్ది సేపటికే రెండు పరుగుల వ్యవధిలో ఇషాన్, కోహ్లి (17) కూడా వెనుదిరగ్గా, పంత్ (8) విఫలమయ్యాడు. అయితే సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్ (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించారు.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 4; మేయర్స్ (ఎల్బీ) (బి) చహల్ 31; పూరన్ (సి) కోహ్లి (బి) హర్షల్ 61; ఛేజ్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 4; పావెల్ (సి) వెంకటేశ్ (బి) బిష్ణోయ్ 2; హొసీన్ (సి అండ్ బి) చహర్ 10; పొలార్డ్ (నాటౌట్) 24; స్మిత్ (సి) రోహిత్ (బి) హర్షల్ 4; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–4, 2–51, 3–72, 4–74, 5–90, 6–135, 7–157.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, దీపక్ చహర్ 3–0–28–1, హర్షల్ పటేల్ 4–0–37–2, చహల్ 4–0–34–1, రవి బిష్ణోయ్ 4–0–17–2, వెంకటేశ్ అయ్యర్ 1–0–4–0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్మిత్ (బి) ఛేజ్ 40; ఇషాన్ కిషన్ (సి) అలెన్ (బి) ఛేజ్ 35; కోహ్లి (సి) పొలార్డ్ (బి) అలెన్ 17; పంత్ (సి) స్మిత్ (బి) కాట్రెల్ 8; సూర్యకుమార్ (నాటౌట్) 34; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1–64, 2–93, 3–95, 4–114.
బౌలింగ్: కాట్రెల్ 4–0–35–1, షెఫర్డ్ 3–0–24–0, ఒడెన్ స్మిత్ 2–0–31–0, హొసీన్ 4–0–34–0, ఛేజ్ 4–0–14–2, అలెన్ 1.5–0–23–1.
Comments
Please login to add a commentAdd a comment