మళ్లీ మెరిసిన రొనాల్డో | Portugal superstar Cristiano Ronaldo's fourth goal of tournament | Sakshi
Sakshi News home page

మళ్లీ మెరిసిన రొనాల్డో

Published Thu, Jun 21 2018 1:05 AM | Last Updated on Thu, Jun 21 2018 1:05 AM

Portugal superstar Cristiano Ronaldo's fourth goal of tournament  - Sakshi

సాకర్‌ సూపర్‌ స్టార్‌గా ప్రపంచమంతటా నీరాజనాలందుకుంటున్న క్రిస్టియానో రొనాల్డో మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. స్పెయిన్‌తో ‘డ్రా’గా ముగిసిన తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో చెలరేగిన ‘సీఆర్‌7’ ఇప్పుడు జట్టు తరఫున ఏకైక గోల్‌ నమోదు చేసి మొరాకో ఆట ముగించాడు. మ్యాచ్‌లో అనేక సందర్భాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినా, ఫినిషింగ్‌ లోపాలతో వెనకబడిన మొరాకో 2018 ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించింది. తాజా గోల్‌తో యూరప్‌ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ సాధించిన ఆటగాడిగా రొనాల్డో రికార్డులెక్కాడు.    మాస్కో: ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌లో పోర్చుగల్‌ జోరు కొనసాగింది. తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ స్పెయిన్‌ను 3–3తో నిలువరించిన ఆ జట్టు గ్రూప్‌ ‘బి’లో బుధవారం మొరాకోను 1–0తో ఓడించింది. పోర్చుగల్‌ తరఫున ఏకైక గోల్‌ను 4వ నిమిషంలో హెడర్‌ ద్వారా కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో సాధించాడు. ఈ గెలుపుతో పోర్చుగల్‌ నాలుగు పాయింట్లతో నాకౌట్‌ దశకు చేరువ కాగా... వరుసగా రెండో పరాజయంతో మొరాకో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 1998లో వరల్డ్‌ కప్‌ ఆడిన తర్వాత వరుసగా నాలుగు సార్లు అర్హత సాధించలేకపోయిన ఆఫ్రికా దేశం మొరాకో... 20 ఏళ్ల తర్వాత క్వాలిఫై అయినప్పటికీ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.  

ఒకటే సరిపోయింది... 
ఇరు జట్ల మధ్య పోరు ఆద్యంతం హోరాహోరీగా సాగింది. సరిగ్గా చెప్పాలంటే పటిష్ట పోర్చుగల్‌ను మొరాకో చాలా వరకు నిలువరించగలిగింది. అయితే ఆరంభంలో రొనాల్డో అందించిన ఆధిపత్యం పోర్చుగల్‌ విజయానికి సరిపోయింది. మ్యాచ్‌ నాలుగో నిమిషంలో కార్నర్‌ నుంచి బెర్నార్డో సిల్వా పాస్‌ అందించగా... వేగంగా ముందుకు దూసుకొస్తూ రొనాల్డో తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించడంలో సఫలమయ్యాడు. ఏకాగ్రత లోపించిన మొరాకో ఆటగాళ్లు గందరగోళంలో పడిపోగా, అప్పటికే ముందుకొచ్చిన గోల్‌ కీపర్‌ ఏమీ చేయలేకపోయాడు. టోర్నీలో ఇది రొనాల్డోకు నాలుగో గోల్‌ కావడం విశేషం. ఈ దశలో మైదానంలో మొరాకో అభిమానులు తమ జట్టుకు గట్టిగా మద్దతు పలుకుతూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. మొరాకో పదే పదే పోర్చుగల్‌ డిఫెన్స్‌ను దాటగలిగినా చెప్పుకోదగిన స్ట్రయికర్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ దశలో ఒత్తిడికి లోను కాకుండా పోర్చుగల్‌ మాత్రం ప్రశాంతంగా ఆటను కొనసాగించింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు దాదాపుగా సమాన సమయం పాటు బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. రెండో అర్ధ భాగంలో కూడా మొరాకో దాడులు తీవ్రం చేసింది. అయితే గోల్‌ మాత్రం దక్కలేదు. యూనిస్‌ బెల్హందకు అద్భుత అవకాశం వచ్చినా... అతను కొట్టిన హెడర్‌ను సరిగ్గా పోస్ట్‌ ముందు పోర్చుగల్‌ కీపర్‌ రుయి పాట్రిషియో  అడ్డుకోగలిగాడు. చివరి నిమిషాల్లో పోర్చుగల్‌ డిఫెన్స్‌ సమర్థంగా పని చేయడంతో మొరాకో ఆటగాళ్లు బాధగా మైదానం వీడారు.  

రొనాల్డో... పోర్ట్‌ (పోర్చుగల్‌) వైన్‌లాంటివాడు. తన వయసు గురించి, తన సామర్థ్యాన్ని ఎంత బాగా వాడుకోవాలనే విషయం గురించి అతనికి చాలా బాగా తెలుసు. ఇతర ఆటగాళ్లకంటే తాను ఎందుకు గొప్పవాడు అతను చూపించాడు. మూడు, నాలుగేళ్ల క్రితం అతను చేయలేనిది ఇప్పుడు చేస్తున్నాడు. 
– పోర్చుగల్‌ కోచ్‌ ఫెర్నాండో సాంటోస్‌  

85 అంతర్జాతీయ మ్యాచ్‌లలో రొనాల్డో సాధించిన గోల్స్‌ సంఖ్య. అత్యధిక గోల్స్‌ సాధించిన యూరోపియన్‌ ఆటగాడిగా ఫెరెంక్‌ పుస్కాస్‌ (హంగేరీ–84)ను దాటిన అతను ఆల్‌టైమ్‌ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అలీ దాయ్‌ (ఇరాన్‌–109) అగ్రస్థానంలో ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement