నిరాశలో రొనాల్డో, ఉరుగ్వే గోల్స్ స్కోరర్ కవాని
ఇటు అర్జెంటీనా... అటు పోర్చుగల్... ఒకే రోజు ఒకే తీరు ఫలితాలు... ఇద్దరు దిగ్గజాల కలలు కల్లలయ్యాయి. మొదట మెస్సీ చిరకాల స్వప్నాన్ని ఎంబాపె (ఫ్రాన్స్) తుడిచిపెడితే... తర్వాత రొనాల్డో ‘ఫిఫా’ వేటను కవాని (ఉరుగ్వే) ముగించాడు. దీంతో ప్రిక్వార్టర్స్‌లోనే మేటి జట్లు నాక్ ‘ఔట్’ అయ్యాయి. ఉరుగ్వే సుడి బాగుంది. రొనాల్డో జట్టును నాకౌట్ దెబ్బకొట్టింది. స్ట్రయికర్ కవాని ‘డబుల్’ ధమాకా పోర్చుగల్‌ను ఇంటిదారి పట్టించింది. మ్యాచ్‌లో ఉరుగ్వే ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. బంతి ఎక్కువగా ప్రత్యర్థి ఆధీనంలో ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఉరుగ్వేదే! ఒక దశలో ఉరుగ్వే ఆటగాళ్లు అలసిపోయినా... గెలిచేదాకా చెమట చిందించారు. ఈ పోరాటానికి, వీరి దుర్బేధ్యమైన డిఫెన్స్‌ను చూసి రొనాల్డోకు చిర్రెత్తిందేమో సహనం కోల్పోయి ‘ఎల్లో’కార్డు చూపించిన రిఫరీ మీదే ఒంటికాలిపై లేచాడు. స్ఫూర్తి మరిచాడు.
సొచీ: పాపం... రొనాల్డోదీ మెస్సీ వ్యథే! పోర్చుగల్ జట్టుదీ అర్జెంటీనా బాటే! ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ అందించాలనుకున్న వీరిద్దరి ఆశలు ప్రిక్వార్టర్స్‌లోనే ఆవిరయ్యాయి. ప్రత్యర్థి పోరాటానికి సమకాలీన దిగ్గజాలు తలవంచక తప్పలేదు. నాకౌట్ దశ మొదలైన తొలి రోజే... ఫ్రాన్స్ దూకుడుకు అర్జెంటీనా, ఉరుగ్వే జోరులో పోర్చుగల్ గల్లంతయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి మొదలైన రెండో నాకౌట్ మ్యాచ్‌లో ఉరుగ్వే 2–1తో ‘యూరో’ చాంపియన్ పోర్చుగల్‌ను కంగుతినిపించింది. అనుభవజ్ఞుడైన ఫార్వర్డ్ ఆటగాడు కవాని ఆరంభం నుంచి అంతా తానై నడిపించాడు.
తొలి, రెండో అర్ధభాగాల్లో ఒక్కో గోల్ చేసి ఉరుగ్వేకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆట ఆరంభమైన ఏడు నిమిషాలకే సురెజ్ ఇచ్చిన పాస్ విజయవంతమైంది. పెనాల్టీ బాక్స్ వెలుపలి నుంచి సురెజ్ కొట్టిన షాట్‌ను స్ట్రయికర్ కవాని గోల్‌పోస్ట్ ముందే కాచుకున్నాడు. మెరుపు వేగంతో హెడర్ గోల్‌గా మలిచాడు. దీంతో ఉరుగ్వే శిబిరం సంబరాల్లో మునిగింది. స్కోరు సమం చేసేందుకు తొలి అర్ధభాగంలో పోర్చుగల్ స్ట్రయికర్లు పడ్డ కష్టమంతా వృథా అయింది. చురుగ్గా, తెలివిగా పాస్‌లిస్తున్నప్పటికీ ఏ ఒక్కటీ గోల్‌పోస్ట్‌ను ఛేదించలేకపోయింది.
చివరకు రెండో అర్ధభాగం మొదలైన 10 నిమిషాలకు గురెరో ఇచ్చిన కార్నర్ పాస్‌ను పెపె (55వ ని.) గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అయితే స్కోరు సమమైన పోర్చుగల్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే మళ్లీ కవాని కదంతొక్కాడు. ఆట 62వ నిమిషంలో ఈ సారి బెటంకుర్ ఇచ్చిన పాస్‌ను కవాని ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను బోల్తాకొట్టిస్తూ రెండో గోల్ సాధించాడు. ఆ తర్వాత పోర్చుగల్ ఎంత ప్రయత్నించినప్పటికీ గోల్ దిశగా సఫలం కాలేకపోయింది. ఆట 74వ నిమిషంలో కవాని కుడికాలికి గాయమవడంతో మైదానం వీడాడు. నొప్పితో విలవిలలాడుతున్న కవానికి రొనాల్డో సాయమందించాడు.
ఈ మ్యాచ్ మొత్తం మీద పోర్చుగల్ షాట్లే ఎక్కువగా దూసుకొచ్చాయి. మ్యాచ్‌లో సింహభాగం వీరి స్ట్రయికర్ల ఆధీనంలోనే బంతి ఆడింది. దీంతో ఉరుగ్వే (273) కంటే పోర్చుగల్ (544) రెట్టింపు పాస్‌లను ప్లేస్ చేసింది. కానీ సరైన దిశ, ఫినిషింగ్ లేక మూల్యం చెల్లించుకుంది. పోర్చుగల్ 20 షాట్లు ప్రత్యర్థి పెనాల్టీ బాక్స్ దిశగా ఆడారు. ఇందులో ఐదుసార్లు లక్ష్యంపై గురిపెడితే ఒక్కసారి మాత్రమే గోల్ అయింది. మరోవైపు ప్రత్యర్థి షాట్లను ఎక్కడికక్కడ నిలువరించిన ఉరుగ్వే మాత్రం కొట్టింది ఐదు షాట్లే. లక్ష్యంపై మూడు సార్లు గురిపెట్టిన ఆ జట్టు రెండు సార్లు గోల్ చేయడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఉరుగ్వే తలపడనుంది.
► ‘ఫిఫా’ ప్రపంచకప్ చరిత్రలో ఉరుగ్వే వరుసగా 4 మ్యాచ్‌లు గెలవడం ఇది రెండోసారి. 1930లో ఉరుగ్వే విజేతగా నిలిచిన టోర్నీలో ఇలాగే జరిగింది.
రిఫరీపై రొనాల్డో ఆగ్రహం
పోర్చుగల్ అభిమాని కంట కన్నీరు
ప్రపంచకప్‌లో నేడు ప్రిక్వార్టర్ ఫైనల్స్
బ్రెజిల్ x మెక్సికో
రా.గం. 7.30 నుంచి
బెల్జియం x జపాన్
రా.గం. 11.30 నుంచి
సోనీ ఈఎస్‌పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment