రొనాల్డో... ఆఖరి అవకాశం | FIFA World Cup Qatar 2022, Group-H: Team previews on Portugal, Ghana, Uruguay, South Korea | Sakshi
Sakshi News home page

రొనాల్డో... ఆఖరి అవకాశం

Published Sat, Nov 19 2022 5:24 AM | Last Updated on Sat, Nov 19 2022 5:24 AM

FIFA World Cup Qatar 2022, Group-H: Team previews on Portugal, Ghana, Uruguay, South Korea - Sakshi

క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు క్రిస్టియానో రొనాల్డో. 2003   నుంచి పోర్చుగల్‌ జాతీయ సీనియర్‌ జట్టుకు ఆడుతున్న రొనాల్డో తన కెరీర్‌లో ప్రొఫెషనల్‌ లీగ్స్‌లో (ప్రీమియర్‌ లీగ్, లా లిగా, చాంపియన్స్‌ లీగ్, సెరియా లీగ్‌)  అందుబాటులో ఉన్న అన్ని గొప్ప టైటిల్స్‌ సాధించాడు. కానీ ప్రపంచకప్‌ ఒక్కటే అతడిని అందని ద్రాక్షగా   ఊరిస్తోంది. వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న రొనాల్డో ఆఖరి ప్రయత్నంగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన నాయకత్వంలో పోర్చుగల్‌ను 2016లో యూరో   చాంపియన్‌గా నిలబెట్టిన రొనాల్డో 2019లో నేషన్స్‌ లీగ్‌ టైటిల్‌ కూడా అందించాడు. ఈసారి పోర్చుగల్‌ విశ్వవిజేతగా నిలిస్తే క్రిస్టియానో రొనాల్డో దిగ్గజాల సరసన చేరడంతోపాటు తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంటాడు.

పోర్చుగల్‌
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1966).
‘ఫిఫా’ ర్యాంక్‌: 9.
అర్హత ఎలా: యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ ప్లే ఆఫ్‌ విజేత.
ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్‌ యువ, సీనియర్‌ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. రికార్డుస్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో జట్టుకు వెన్నెముకలాంటి వాడు. పోర్చుగల్‌ తరఫున ఇప్పటి వరకు 191 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 117 గోల్స్‌ సాధించి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. రొనాల్డోతోపాటు రాఫెల్‌ లియావో, బెర్నార్డో సిల్వా, రూబెన్‌ డయాస్‌ కీలక ఆటగాళ్లు.   

ఘనా
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్‌ ఫైనల్‌ (2010).
‘ఫిఫా’ ర్యాంక్‌: 61.
అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్‌ మూడో రౌండ్‌ విజేత.  
‘బ్లాక్‌ స్టార్స్‌’గా పేరున్న ఘనా నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతోంది. 2018 ప్రపంచకప్‌నకు అర్హత పొందలేకపోయిన ఘనా అంతకుముందు రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్‌ దశను దాటి ముందుకెళ్లింది. ఈసారి తమ గ్రూప్‌లోని మూడు జట్లు పటిష్టమైనవి కావడంతో ఘనా సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. డెనిస్‌ ఒడోయ్, లాంప్టె, కుడుస్, అబ్దుల్‌ రహమాన్‌ కీలక ఆటగాళ్లు.  

ఉరుగ్వే
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్‌ (1930, 1950).
‘ఫిఫా’ ర్యాంక్‌: 14.
అర్హత ఎలా: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌లో మూడో స్థానం.
నిలకడలేని ప్రదర్శనకు మారుపేరైన ఉరుగ్వే 14వసారి ప్రపంచకప్‌లో పోటీపడుతోంది. రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన మూడు జట్లలో ఒకటైన ఉరుగ్వే ఈసారి ఎంత దూరం వెళ్తుందనేది అంచనా వేయలేము. గోల్‌కీపర్‌ ఫెర్నాండో ముస్లెరా, కెప్టెన్‌ డీగో గోడిన్, మార్టిన్‌ సెసెరెస్, లూయిస్‌ స్వారెజ్, ఎడిన్సన్‌ కవానిలకు 100 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. సీనియర్లు సత్తా చాటుకుంటే ఉరుగ్వే జట్టుకు గ్రూప్‌ దశ దాటడం ఏమంత కష్టం కాబోదు.  

దక్షిణ కొరియా
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం (2002).
‘ఫిఫా’ ర్యాంక్‌: 28.
అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్‌ మూడో రౌండ్‌ గ్రూప్‌ ‘ఎ’ రన్నరప్‌.  
ప్రపంచకప్‌లో ఆసియా నుంచి అత్యధికసార్లు బరిలోకి దిగిన జట్టు దక్షిణ కొరియా. ఇప్పటి వరకు 11 సార్లు పోటీపడిన కొరియా తాము ఆతిథ్యమిచ్చిన 2002 టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏ ఆసియా జట్టుకైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 1986 నుంచి ప్రతి ప్రపంచకప్‌నకు అర్హత పొందిన కొరియా 2002లో మినహా మిగతా అన్నిసార్లు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. స్టార్‌ ప్లేయర్‌ సన్‌ హెయుంగ్‌ మిన్‌ ఫామ్‌ కొరియా విజయావకాశాలను నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు.                  

–సాక్షి క్రీడా విభాగం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement