ఇదికాకుంటే... మరోటి అనుకునేందుకు లేదు. వెనుకబడితే... వెన్నులో వణుకు పుట్టినట్లే. గెలిస్తే ముందుకు... లేదంటే ఇంటికే. ‘కిక్’ ఎవరిదో... వారే నాకౌట్ విజేత! నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్ సమరం...!
మాస్కో: అభిమానులను ఉర్రూతలూగిస్తూ... ఫుట్‌బాల్ ప్రపంచకప్ రెండో అంకానికి చేరింది. 32 జట్లు సగమై 16 మిగిలాయి. ఈ సగంలో మరింత ముందుకెళ్లే సగమేవో తేల్చేందుకు శనివారం నుంచే పోరు. కజన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచే దిగ్గజాలైన అర్జెంటీనా–ఫ్రాన్స్ మధ్య. ప్రిక్వార్టర్స్ దశలోనే తలపడుతున్న మాజీ విజేతలు ఈ రెండే కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో పోర్చుగల్‌ను ఉరుగ్వే ‘ఢీ’ కొట్టనుంది. చిత్రమేమంటే ఇప్పటివరకు కప్ గెలుచుకున్న 8 దేశాల్లో ఇటలీ ఈసారి అర్హత సాధించలేదు. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. నేటి ఫ్రాన్స్, అర్జెంటీనా మ్యాచ్‌తో ఓ మాజీ విజేత ఇంటిముఖం పట్టడం ఖాయం. మిగతా ఐదు మాజీ చాంపియన్లలో ఎన్నింటికి షాక్ తగులుతుందో చూడాలి.
దృష్టంతా వారిపైనే...
జట్లుగా తలపడుతున్నా అందరి కళ్లూ అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ, ఫ్రాన్స్ మెరిక ఆంటోన్ గ్రీజ్‌మన్ పైనే. వీరిద్దరూ టోర్నీలో చెరో గోలే చేసినా... ఆటతీరులో మొత్తం జట్టుపై వారి ప్రభావం తీసిపారేయలేనిది. బలాబలాల్లోకి వస్తే అర్జెంటీనాపై ఫ్రాన్స్‌కే కొంత మొగ్గు కనిపిస్తోంది. ఆ జట్టులోని పోగ్బా, ఎంబాపె ఫామ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ అవుతున్నాడు. లీగ్ దశలో ప్రత్యర్థులు అతడినే లక్ష్యం చేసుకోవడంతో జట్టుకు కష్టాలు ఎదురయ్యాయి. చివరి మ్యాచ్‌లో మార్కస్ రొజొ మెరిసినా... స్వతహాగా అతడు డిఫెండర్. మెస్సీకి హిగుయెన్, అగ్యురో తోడైతేనే ప్రత్యర్థిపై అర్జెంటీనా పైచేయి సాధించగలదు. ఫ్రాన్స్ లీగ్ దశలో ఓటమి లేకుండా ప్రిక్వార్టర్స్ చేరగా, అర్జెంటీనా మిశ్రమ ఫలితాలతో గట్టెక్కింది. ప్రపంచ కప్ చరిత్రలో ఫ్రాన్స్‌పై రెండుసార్లూ అర్జెంటీనాదే విజయం. 1930లో 1–0తో, 1978లో 2–1తో గెలుపొందింది.
రొనాల్డో వర్సెస్ సురెజ్
సోచిలో శనివారం అర్ధరాత్రి 11.30కు జరుగనున్న మరో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో పోర్చుగల్ తో ఉరుగ్వే తలపడనుంది. 1972 తర్వాత ఈ రెండు జట్లు మరోసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఉరుగ్వేతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకసారి నెగ్గిన పోర్చుగల్, మరోసారి ‘డ్రా’తో సరిపెట్టుకుంది. పోర్చుగల్ ఆశలన్నీ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోపైనే. ఈ టోర్నీలో అతను ఇప్పటికి నాలుగు గోల్స్ చేశాడు. మరోవైపు ఉరుగ్వే స్టార్ ఆటగాడు సురెజ్ ఆటతీరుపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది.
ప్రిక్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్
జూన్ 30
అర్జెంటీనా x ఫ్రాన్స్
రాత్రి గం. 7.30 నుంచి
పోర్చుగల్ x ఉరుగ్వే
రాత్రి గం. 11.30 నుంచి
జూలై 1
స్పెయిన్ x రష్యా
రాత్రి గం. 7.30 నుంచి
క్రొయేషియా x డెన్మార్క్
రాత్రి గం. 11.30 నుంచి
జూలై 2
బ్రెజిల్ x మెక్సికో
రాత్రి గం. 7.30 నుంచి
బెల్జియం x జపాన్
రాత్రి గం. 11.30 నుంచి
జూలై 3
స్వీడన్ x స్విట్జర్లాండ్
రాత్రి గం. 7.30 నుంచి
కొలంబియా x ఇంగ్లండ్
రాత్రి గం. 11.30 నుంచి
సోనీ ఈఎస్‌పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment