ప్రణయ్ ‘పవర్
పాలెమ్‌బాంగ్ (ఇండోనేసియా): అంచనాలకు మించి రాణించిన భారత యువతార హెచ్‌ఎస్ ప్రణయ్... ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదోసీడ్ ప్రణయ్ 21-11, 22-20తో క్వాలిఫయర్ ఫిర్మాన్ అబ్దుల్ కొలిక్ (ఇండోనేసియా)పై గెలిచాడు. తద్వారా కెరీర్‌లో తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా... విదేశీగడ్డపై ఈ ఘనత సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. గతంలో శ్రీకాంత్ (థాయ్‌లాండ్ ఓపెన్), అరవింద్ భట్ (జర్మన్ ఓపెన్) ఈ ఘనత సాధిం చాడు. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రణయ్‌కు విజేత హోదాలో తొమ్మిది వేల డాలర్ల (రూ. 5 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
అబ్దుల్‌తో 43 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో ప్రణయ్ ఆకట్టుకున్నాడు. తొలి గేమ్ ఆరంభంలో 6-2 ఆధిక్యంలో నిలిచిన అతను దాన్ని అలాగే కొనసాగిస్తూ చివర్లో ఐదు వరుస పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో కాస్త పుంజుకున్నట్లు కనిపించిన ఫిర్మాన్ పలుమార్లు స్కోర్లు సమం చేశాడు. అయితే కీలకదశలో ప్రణయ్ పైచేయి సాధించాడు.
‘ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలుస్తానని అనుకోలేదు. వియత్నాం ఓపెన్ ఫైనల్లో ఓడిన తర్వాత చాలా నిరాశకు గురయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కో మ్యాచ్‌పై దృష్టిపెట్టా. ప్రాథమికాంశాలకు కట్టుబడి ఆడితే గెలుపు గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది ఫలితాన్నిచ్చింది’ అని ప్రణయ్ వ్యాఖ్యానించాడు.
Pranay HS, badminton, Grand Prix Gold title