ప్రిక్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
జ్వాల జోడీ ముందంజ చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్
చాంగ్జౌ: భారత మేటి షట్లర్ పి.వి.సింధు.. చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగోసీడ్ సింధు 21-16, 21-12తో నట్సుకి నిడైరా (జపాన్)పై నెగ్గింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన హైదరాబాదీ.. కేవలం 34 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. తొలి గేమ్‌లో 6-6తో స్కోరు సమమైన తర్వాత సింధు వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా రెండు, మూడు పాయింట్లు సాధిస్తూ దూసుకుపోయింది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరూ పాయింట్ల కోసం పోరాడటంతో స్కోరు 2-2, 3-3తో సమమైంది.
ఈ దశలో వ్యూహం మార్చిన సింధు బలమైన స్మాష్‌లతో నిడైరాను కట్టిపడేసింది. స్కోరు 10-7 ఉన్న దశలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి అదే జోరుతో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో జ్వాల-అశ్విని 21-16, 21-18తో మి కున్ చో-మెంగ్ యిన్ లీ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
పురుషుల సింగిల్స్‌లో ఏడోసీడ్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రెండోరౌండ్లో ప్రణయ్ 21-13, 21-11తో హుయాంగ్ యుజియాంగ్ (చైనా)పై నెగ్గాడు. మూడోసీడ్ శ్రీకాంత్ మాత్రం తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. 12-21, 17-21తో లిన్ యు హుసైన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడాడు. డబుల్స్ తొలిరౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 21-18, 21-13తో యంగ్ కి టెర్రీ హీ-కీన్ హీన్ లో (సింగపూర్)పై గెలవగా, మను అత్రి-సుమీత్ రెడ్డి 19-21, 16-21తో రుడ్ బోస్ (నెదర్లాండ్స్)-ఒలివర్ లియోడాన్ (న్యూజిలాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.