Grand Prix Gold badminton tournament
-
క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
► జ్వాల-అశ్విని జంట కూడా ► చైనా మాస్టర్స్ టోర్నీ జియాంగ్సు (చైనా): సింగిల్స్‌లో బరిలో ఉన్న ఏకైక భారత క్రీడాకారిణి పీవీ సింధు చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సింధు 21-9, 21-17తో చియెన్ హు యు (చైనీస్ తైపీ)పై అలవోకగా గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 5-3తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21-10, 21-15తో డారెన్ లూ (మలేసియా)ను ఓడించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం ముందంజ వేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని 21-12, 21-12తో సెయి పె చెన్-వు తి జుంగ్ (చైనీస్ తైపీ) లపై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ ద్వయం 17-21, 12-21తో వాంగ్ యిల్యు-జాంగ్ వెన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
జ్వాల జోడీ ముందంజ చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంగ్జౌ: భారత మేటి షట్లర్ పి.వి.సింధు.. చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగోసీడ్ సింధు 21-16, 21-12తో నట్సుకి నిడైరా (జపాన్)పై నెగ్గింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన హైదరాబాదీ.. కేవలం 34 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. తొలి గేమ్‌లో 6-6తో స్కోరు సమమైన తర్వాత సింధు వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా రెండు, మూడు పాయింట్లు సాధిస్తూ దూసుకుపోయింది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరూ పాయింట్ల కోసం పోరాడటంతో స్కోరు 2-2, 3-3తో సమమైంది. ఈ దశలో వ్యూహం మార్చిన సింధు బలమైన స్మాష్‌లతో నిడైరాను కట్టిపడేసింది. స్కోరు 10-7 ఉన్న దశలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి అదే జోరుతో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో జ్వాల-అశ్విని 21-16, 21-18తో మి కున్ చో-మెంగ్ యిన్ లీ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో ఏడోసీడ్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రెండోరౌండ్లో ప్రణయ్ 21-13, 21-11తో హుయాంగ్ యుజియాంగ్ (చైనా)పై నెగ్గాడు. మూడోసీడ్ శ్రీకాంత్ మాత్రం తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. 12-21, 17-21తో లిన్ యు హుసైన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడాడు. డబుల్స్ తొలిరౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 21-18, 21-13తో యంగ్ కి టెర్రీ హీ-కీన్ హీన్ లో (సింగపూర్)పై గెలవగా, మను అత్రి-సుమీత్ రెడ్డి 19-21, 16-21తో రుడ్ బోస్ (నెదర్లాండ్స్)-ఒలివర్ లియోడాన్ (న్యూజిలాండ్) చేతిలో పరాజయం చవిచూశారు. -
ప్రి క్వార్టర్స్‌లో కశ్యప్
ముల్హీమ్ అన్ డెర్ రుర్ (జర్మనీ ): జర్మన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో కశ్యప్ 21-12, 21-11తో జోషువా మజీ (ఐర్లాండ్)పై గెలిచాడు. అంతకుముందు తొలి రౌండ్లో కశ్యప్ 21-9, 21-9తో అర్తెమ్ పొచ్తరెవ్ (ఉక్రెయిన్)ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 12-21, 21-18, 21-11తో టకుమా ఉయెదా (జపాన్)పై, సమీర్ వర్మ 21-9, 21-8తో దిమిత్రో జవద్స్కీ (ఉక్రెయిన్)పై గెలిచారు. మరోవైపు పీవీ సింధు 21-11, 21-13తో రోంగ్ ష్కాఫెర్ (అమెరికా)పై విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మిచెల్లి లీ (కెనడా)తో సింధు ఆడుతుంది. -
క్వార్టర్స్‌లో ప్రణయ్
బిట్ బర్గర్ ఓపెన్ సార్‌బ్రుకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకుపోయాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఏడోసీడ్ ప్రణయ్ 21-19, 21-18తో 9వ సీడ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడికి ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో తన్వీ లాడ్ 17-21, 12-21తో సన్ యు (చైనా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 15-21, 22-20, 21-12తో కోల్బెర్జ్-నిక్లాస్ నోహర్ (డెన్మార్క్)లపై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అక్షయ్ దివాల్కర్-ప్రద్నా గాద్రె జోడీ 13-21, 21-19, 21-17తో జాకో అరెండేస్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్)పై; అశ్విని పొన్నప్ప-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) 23-21, 21-12తో జెలీ మాస్-ఐరిస్ టాబ్లెంగ్ (నెదర్లాండ్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. మను అత్రీ-సిక్కి రెడ్డి ద్వయం 15-21, 7-21తో లాంగ్ఫి షి-క్వియాన్ జోంగ్ (చైనా) చేతిలో ఓడింది.