వాడియాపై ప్రీతి జింటా కేసు
ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ వివాదాల్లేకుండా పూర్తయిందనుకుంటే... టోర్నీ ముగిశాక కొత్త వివాదం మొదలైంది. పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా... ఆ జట్టుకే చెందిన మరో యజమాని, తన మాజీ ప్రేమికుడు నెస్‌వాడియాపై కేసు పెట్టింది.
మే 30న వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా... నెస్‌వాడియా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు బెదిరించాడని ప్రీతిజింటా గురువారం రాత్రి ముంబైలోని మెరీన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వాడియాపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 39 ఏళ్ల జింటా గర్వారే పెవిలియన్‌లో ఉండగా వాడియా (44) అక్కడికి వచ్చి విష్ చేసి ఆ తర్వాత అందరి ముందు ఆమెను తిట్టినట్టు సమాచారం. వీరిద్దరు గతంలో ఐదేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత విడిపోయినప్పటికీ వేధింపులు మానలేదని జింటా పేర్కొంది. ఇది తనకు కష్టకాలమని, మీడియా ఈ విషయంలో సంయమనం పాటించాలని కోరింది. ఏ మహిళ కూడా ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవాలని భావించదని, తాను ఎవరికీ హాని చేయాలని చూడడం లేదని ప్రీతి పేర్కొంది.
పోలీసుల విచారణ మొదలు
ప్రీతి ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు తమ విచారణను ప్రారంభించారు. ఐపీఎల్ సీఈవో సుందర్ రామన్, వాంఖడే స్టేడియం సిబ్బందిని వీరు ప్రశ్నించే అవకాశం ఉంది. వీరితో పాటు పంజాబ్‌కు చెందిన చాలా మంది ఆట గాళ్లు, సహాయక సిబ్బంది కూడా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారని, వీరి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు 24 గంటల్లో వాడియాను అరెస్ట్ చేయాలని మహారాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ డిమాండ్ చేసింది.
షాక్ అయ్యాను: నెస్ వాడియా
ప్రీతి జింటా ఇచ్చిన ఫిర్యాదుపై నెస్ వాడియా స్పందించారు. ‘నిజంగా ఇది నన్ను షాక్‌కు గురిచేసింది. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అసలు జింటాపై దాడి చేయడమనేది అసంభవం. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తన చుట్టూ బౌన్సర్లను రక్షణగా పెట్టుకుంటుంది’ అని వాడియా అన్నారు. వాడియా కొంతకాలంగా మరో అమ్మాయితో స్నేహంగా ఉంటున్నాడని, ఇది చూసి ఓర్వలేకే ప్రీతి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వాడియా సన్నిహితులు పేర్కొంటున్నారు.