విజేతలకు బహుమతులను అందిస్తున్న సినీ హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు క్రీడోత్సవాలలో భాగంగా టగ్ ఆఫ్ వార్ పోటీలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జట్టు విజేతగా నిలిచింది. సైబరాబాద్ సీపీ జట్టుతో జరిగిన ఫైనల్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జట్టు విజయం సాధించింది. పరుగుపందెం పోటీలో పురుషుల విభాగంలో రవి నాయక్ (పీసీ), మహిళల విభాగంలో రమాదేవి (డబ్ల్యూపీసీ) విజేతలుగా నిలిచారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీలలో ఐదు జోన్‌లకు చెందిన లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ కానిస్టేబుళ్ల నుంచి ఏడీసీపీ ఆఫీసర్ వరకు మినిస్టిరీయల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, క్యారమ్స్, చెస్ బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీలను నిర్వహించారు.
క్రీడలతోనే ఫిట్‌నెస్ సాధ్యం...
ముగింపు ఉత్సవంలో రాష్ట్ర హోంశాఖా ముఖ్య కార్యదర్శి రవి గుప్తా పాల్గొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో రవి గుప్తా మాట్లాడుతూ... నిత్యం విధులను నిర్వహించే పోలీసులకు ఆటవిడుపుగా క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలు మానసిక స్థయిర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ప్రతి ఒక్కరికి టీమ్ స్పిరిట్ ఉండాలన్నారు. ప్రతి యేటా క్రీడోత్సవాలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. సినీ హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ మాట్లాడుతూ... పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. పోలీసుల మానసికోల్లాసం కోసం వార్షిక పోటీలను నిర్వహించిన సైబరాబాద్ సీపీని ఆమె అభినందించారు. అంతకుముందు గన్ పేల్చి పరుగుపందెం పోటీలను రవి గుప్తా, సజ్జనార్‌తో కలిసి నమ్రతా శిరోద్కర్, అంజలి గుప్తాలు ప్రారంభించారు. ఉత్సాహంగా సాగిన టగ్ ఆఫ్ వార్ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తితో తిలకించారు. ఆ తర్వాత విజేతలకు నమ్రతా శిరోద్కర్, రవి గుప్తా, సజ్జనార్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ సతీమణులతో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో సజ్జనార్ సతీమణి అనుపమ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ విజయ కుమార్, బాలానగర్ డీసీపీ పద్మజ, విమెన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సెల్ డీసీపీ అనసూయ, ఏడీసీపీ ఎస్‌బి గౌస్ మోహినుద్దీన్, ఏడీసీపీ క్రైమ్ కవిత, ఇందిర, లావణ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment