tug of war championship
-
టగ్ ఆఫ్ వార్ చాంపియన్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియాలో భాగంగా జరిగిన ఏక్ భారత్–శ్రేష్ట్ భారత్ జాతీయ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో పురుషుల తెలంగాణ జట్టు అదరగొట్టింది. ఈ టోర్నీలో హరియాణా జట్టుతో కలిసి బరిలో దిగిన తెలంగాణ టీమ్ పురుషుల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా జరిగిన పురుషుల (720 కేజీలు) ఫైనల్లో మహారాష్ట్ర–ఒడిశాపై తెలంగాణ–హరియాణా విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్–అరుణాచల్‌ప్రదేశ్–మేఘాలయ జట్టుకు కాంస్య పతకం లభించింది. మహిళల విభాగంలో మాత్రం తెలంగాణ జట్టుకు తుదిపోరులో చుక్కెదురైంది. ఇందులోనూ హరియాణాతో జత కట్టిన తెలంగాణ ఫైనల్లో మహారాష్ట్ర–ఒడిశా చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఉత్తరాఖండ్–కర్ణాటక జట్టుకు కాంస్య పతకం లభించింది. తెలంగాణ పురుషుల జట్టులో ఎన్.రాఘవేందర్ (కెప్టెన్), ఎ.రాజశేఖర్, పి.విజయ్ కుమార్, పి.సుధీర్ కుమార్, కె.వివేకానంద, ఎన్.మహేందర్ ఉండగా... మహిళల జట్టులో డి. సంఘవి (కెప్టెన్), కె.త్రిపుజ, జి.మమత, జె.భవాని, జి.మనస్విని, ఎమ్.ఉమ ఉన్నారు. పురుషుల జట్టుకు ఎ.భానుప్రకాశ్... మహిళల జట్టుకు ఎ.అక్షర కోచ్‌లుగా వ్యవహరించారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి విజేత జట్లకు ట్రోఫీలను, పతకాలను బహూకరించారు. -
టగ్ ఆఫ్ వార్ విజేత హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జట్టు
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు క్రీడోత్సవాలలో భాగంగా టగ్ ఆఫ్ వార్ పోటీలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జట్టు విజేతగా నిలిచింది. సైబరాబాద్ సీపీ జట్టుతో జరిగిన ఫైనల్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జట్టు విజయం సాధించింది. పరుగుపందెం పోటీలో పురుషుల విభాగంలో రవి నాయక్ (పీసీ), మహిళల విభాగంలో రమాదేవి (డబ్ల్యూపీసీ) విజేతలుగా నిలిచారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీలలో ఐదు జోన్లకు చెందిన లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ కానిస్టేబుళ్ల నుంచి ఏడీసీపీ ఆఫీసర్ వరకు మినిస్టిరీయల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, క్యారమ్స్, చెస్ బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీలను నిర్వహించారు. క్రీడలతోనే ఫిట్నెస్ సాధ్యం... ముగింపు ఉత్సవంలో రాష్ట్ర హోంశాఖా ముఖ్య కార్యదర్శి రవి గుప్తా పాల్గొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో రవి గుప్తా మాట్లాడుతూ... నిత్యం విధులను నిర్వహించే పోలీసులకు ఆటవిడుపుగా క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలు మానసిక స్థయిర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ప్రతి ఒక్కరికి టీమ్ స్పిరిట్ ఉండాలన్నారు. ప్రతి యేటా క్రీడోత్సవాలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. సినీ హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ మాట్లాడుతూ... పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. పోలీసుల మానసికోల్లాసం కోసం వార్షిక పోటీలను నిర్వహించిన సైబరాబాద్ సీపీని ఆమె అభినందించారు. అంతకుముందు గన్ పేల్చి పరుగుపందెం పోటీలను రవి గుప్తా, సజ్జనార్‌తో కలిసి నమ్రతా శిరోద్కర్, అంజలి గుప్తాలు ప్రారంభించారు. ఉత్సాహంగా సాగిన టగ్ ఆఫ్ వార్ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తితో తిలకించారు. ఆ తర్వాత విజేతలకు నమ్రతా శిరోద్కర్, రవి గుప్తా, సజ్జనార్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ సతీమణులతో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో సజ్జనార్ సతీమణి అనుపమ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ విజయ కుమార్, బాలానగర్ డీసీపీ పద్మజ, విమెన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సెల్ డీసీపీ అనసూయ, ఏడీసీపీ ఎస్బి గౌస్ మోహినుద్దీన్, ఏడీసీపీ క్రైమ్ కవిత, ఇందిర, లావణ్య పాల్గొన్నారు. -
విజేతలు హైదరాబాద్, రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. మహబూబాబాద్ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో హైదరాబాద్ మహిళల జట్టు, రంగారెడ్డి పురుషుల జట్టు చాంపియన్లుగా నిలిచాయి. సోమవారం జరిగిన మహిళల ఫైనల్లో హైదరాబాద్ 3–0తో మహబూబాబాద్‌పై నెగ్గింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కరీంనగర్ 3–0తో వరంగల్ రూరల్‌ను ఓడించింది. పురుషుల టైటిల్ పోరులో రంగారెడ్డి 3–0తో హైదరాబాద్‌పై గెలుపొందింది. కామారెడ్డి 3–0తో సిద్దిపేట్‌ను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం (టీఎస్‌టీడబ్ల్యూఏ) కార్యదర్శి పి. ఎమ్మాన్యుయేల్, తొర్రూర్ జెడ్పీటీసీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. -
సెమీ ఫైనల్లో తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు నిలకడగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మహారాష్ట్రలోని స్పోర్ట్స్ గ్రౌండ్ ప్రిపరేటరీ అకాడమీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో తెలంగాణ అండర్–15 (440 కేజీలు), అండర్–17 (బాలుర 480 కేజీలు), అండర్–17 (మిక్స్డ్ టీమ్ 500 కేజీలు) జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. అండర్–15 బాలుర 440 కేజీల లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ జట్టు వరుసగా 3–0తో గుజరాత్‌పై, 3–0తో మహారాష్ట్రపై, 3–0తో ఢిల్లీపై, 3–0తో ఆంధ్రప్రదేశ్‌పై, 3–0తో ఒడిశాపై, 3–0తో యూపీపై, 3–0తో మధ్యప్రదేశ్‌పై, 3–0తో జమ్మూ కశీ్మర్‌పై, 3–0తో హరియాణాపై, 3–0తో తమిళనాడుపై, 3–0తో అస్సాంపై, 3–0తో మణిపూర్‌పై, 3–0తో మిజోరామ్‌పై, 3–0తో ఉత్తరాఖండ్‌పై, 3–0తో త్రిపురపై, 3–0తో బిహార్‌పై గెలుపొందాయి. నేడు జరిగే సెమీస్ మ్యాచ్‌ల్లో కర్ణాటకతో కేరళ, తెలంగాణతో ఢిల్లీ తలపడతాయి. అండర్–17 బాలుర లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 3–0తో వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, హరియాణా, తమిళనాడు, అస్సాం, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, త్రిపుర, బిహార్‌పై గెలిచాయి. సెమీస్ మ్యాచ్‌ల్లో తెలంగాణతో పంజాబ్, కేరళతో ఢిల్లీ ఆడతాయి. అండర్–17 మిక్స్డ్ టీమ్ లీగ్ మ్యాచ్‌ల్లో వరుసగా తెలంగాణ 3–0తో గుజరాత్‌పై, 3–0తో మహారాష్ట్రపై, 3–0తో ఢిల్లీపై, 3–0తో ఏపీపై, 3–0తో ఒడిశాపై, 3–0తో యూపీపై, 3–0తో మధ్యప్రదేశ్‌పై, 3–0తో జమ్మూ కశ్మీర్‌పై, 3–0తో హరియాణాపై, 3–0తో తమిళనాడుపై, 3–0తో అస్సాంపై, 3–0తో మణిపూర్‌పై, 3–0తో మిజోరామ్‌పై, 3–0తో ఉత్తరాఖండ్‌పై, 3–0తో త్రిపురపై, 3–0తో బిహార్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాయి. నేడు జరిగే సెమీస్ మ్యాచ్‌ల్లో మహారాష్ట్రతో కర్ణాటక, తెలంగాణతో గుజరాత్ పోటీ పడతాయి. -
తెలంగాణకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటారు. తమిళనాడులో జరిగిన ఈ టోర్నీలో అండర్–13, అండర్–15, అండర్–17 విభాగాల్లో ఓ రజతం, రెండు కాంస్యాలతో మొత్తం మూడు పతకాలు సాధించారు. అండర్–13 బాలికల (340 కేజీలు) విభాగం ఫైనల్లో తెలంగాణ జట్టు 1–2తో కేరళ చేతిలో పరాజయం పాలైంది. దీంతో కేరళకు స్వర్ణం, తెలంగాణకు రజత పతకాలు లభించాయి. తమిళనాడు జట్టు మూడో స్థానంలో నిలిచింది. అండర్–15 బాలికల (360 కేజీలు) విభాగం సెమీఫైనల్లో తెలంగాణ 0–3తో ఢిల్లీ చేతిలో ఓడింది. కాంస్య పతకం కోసం నిర్వహించిన పోరులో 3–0తో కర్ణాటకను మట్టికరిపించి మూడో స్థానం దక్కించుకుంది. కేరళకు స్వర్ణం, ఢిల్లీకి రజత పతకాలు లభించాయి. అండర్–17 బాలికల (420 కేజీలు) విభాగం సెమీస్ తెలం గాణ 0–3తో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. అనంతరం జరిగిన కాంస్య పోరులో మన జట్టు 3–0తో తమిళనాడుపై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. కేరళకు స్వర్ణం, ఢిల్లీకి రజతం దక్కాయి. -
తెలంగాణకు నాలుగు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ మినీ సబ్ జూనియర్, సబ్ జూనియర్, జూనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు రాణించాయి. మహారాష్ట్రలోని గురు గోవింద్ సింగ్ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగిన ఈ టోర్నీలో నాలుగు కాంస్య పతకాలను సాధించాయి. అండర్–19 బాలుర 540 కేజీలు, అండర్–17 బాలుర 480 కేజీలు, అండర్–17 బాలుర 500 కేజీలు, అండర్–15 బాలుర 440 కేజీల విభాగాల్లో తెలంగాణ జట్లు మూడో స్థానంలో నిలిచాయి. మంగళవారం జరిగిన అండర్–19 బాలుర ఫైనల్లో కేరళ 2–1తో ఢిల్లీపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 3–0తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించింది. సెమీస్‌లో ఢిల్లీ 3–0తో ఆంధ్రప్రదేశ్‌పై, కేరళ 3–0తో తెలంగాణపై గెలుపొందాయి. అండర్–17 బాలుర 480 కేజీల టైటిల్‌పోరులో కేరళ 3–0తో ఢిల్లీపై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 3–0తో మహారాష్ట్రపై విజయం సాధించింది. 500 కేజీల విభాగంలో ఢిల్లీ, కేరళ తొలి రెండు స్థానాలను దక్కించుకోగా తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. తెలంగాణ 3–0తో జమ్ము కశ్మీర్‌ను ఓడించి మూడోస్థానాన్ని అందుకుంది. అండర్–15 బాలుర తుదిపోరులో కేరళ 3–0తో ఢిల్లీపై నెగ్గగా... మూడోస్థానం జరిగిన పోరులో తెలంగాణ 3–0తో కర్ణాటకను ఓడించింది. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ టగ్ ఆఫ్ వార్ సంఘం అధ్యక్షుడు ఇంద్రసేన్ రెడ్డి, ప్యాట్రన్ చల్లా భరత్ కుమార్ రెడ్డి, కార్యదర్శి ఎమ్మాన్యుయేల్ పాల్గొన్నారు. కాంస్యాలు సాధించిన తెలంగాణ జట్లను అభినందించారు. , , -
విజేత హైదరాబాద్ మహిళల జట్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ మహిళల, రంగారెడ్డి పురుషుల జట్లు విజేతలుగా నిలిచాయి. మహబూబాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల 640 కేజీ ఫైనల్లో రంగారెడ్డి 3–0తో యాదాద్రిపై గెలుపొంది స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వరంగల్ 3–0తో హైదరాబాద్‌పై విజయం సాధించి కాంస్యాన్ని గెలుచుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 3–0తో వరంగల్‌పై, యాదాద్రి 3–0తో హైదరాబాద్‌పై గెలిచాయి. మరోవైపు మహిళల 500 కేజీ తుదిపోరులో హైదరాబాద్ 3–0తో యాదాద్రిని ఓడించి విజేతగా నిలిచింది. రంగారెడ్డి 3–0తో వరంగల్‌పై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 3–0తో రంగారెడ్డిపై, యాదాద్రి 3–0తో వరంగల్‌పై గెలుపొందాయి. -
తెలంగాణ జట్లకు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు ఆకట్టుకున్నాయి. పంజాబ్‌లో జరిగిన ఈ టోర్నీలో రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నాయి. మహిళల టీమ్, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో తెలంగాణ జట్లు మూడో స్థానంలో నిలిచి పతకాలను సాధించాయి. శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజి ప్రాంగణంలో గురువారం జరిగిన సీనియర్ మహిళల (480 కేజీలు) టీమ్ విభాగంలో తెలంగాణ మహిళల జట్టు 3–0తో బిహార్‌పై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు సెమీస్ మ్యాచ్‌ల్లో పంజాబ్ 3–0తో తెలంగాణపై, కేరళ 3–0తో బిహార్‌పై గెలుపొందాయి. సెమీస్‌లో ఓటమి పాలైన జట్లు కాంస్య పతకం కోసం తలపడ్డాయి. నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కూడిన మిక్స్డ్ టీమ్ (540 కేజీలు) విభాగంలో తెలంగాణ 3–0తో మణిపూర్‌ను ఓడించి కాంస్యాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 0–3తో ఛత్తీస్‌గఢ్‌పై, మణిపూర్ 0–3తో పంజాబ్ చేతిలో పరాజయం పొం దాయి. జాతీయ స్థాయిలో రాణించిన తెలంగాణ జట్లను తెలంగాణ టగ్ ఆఫ్ వార్ (టీఎస్‌టీడబ్ల్యూఏ) సంఘం అధికారులు, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు శుక్రవారం అభినందించారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడబ్ల్యూఏ ఎండీ చల్లా భరత్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎ. మహేశ్, కార్యదర్శి పి. ఎమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు కెప్టెన్‌గా ఎన్. రాఘవేంద్ర, మహిళల జట్టుకు కెప్టెన్‌గా ఎ. దివ్య చౌదరి వ్యవహరించనున్నారు. మిక్స్డ్ టీమ్‌కు వి. షన్మితా రెడ్డి సారథ్యం వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పురుషుల, మహిళల జట్లకు సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. పంజాబ్‌లో రేపటి నుంచి ఈనెల 18 వరకు జాతీయ సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్ జరుగనుంది. జట్ల వివరాలు పురుషులు: ఎన్. రాఘవేంద్ర (కెప్టెన్), ఎ. రాజశేఖర్ (వైస్ కెప్టెన్), ఎస్. భాస్కర్, టి. కార్తీక్, జి. మధు, బి. బాలు, ఆర్. గోవింద్, కె. మహేశ్, పి. రాకేశ్, టి. శ్రీనివాస్ (కోచ్), దేవీ వరప్రసాద్ (మేనేజర్). మహిళలు: ఎ. దివ్య చౌదరి (కెప్టెన్), వి. దివ్య (వైస్ కెప్టెన్), రసజ్ఞ, జి. అమరావతి, వి. కావ్య, ఎస్. శిరీష, కె. మమత, కె. సారిక, వై. శిరీష, కృష్ణారావు (కోచ్), సంయుక్త (మేనేజర్). మిక్స్డ్ టీమ్: వి. షన్మితా రెడ్డి (కెప్టెన్), కె. కావ్య (వైస్ కెప్టెన్), ఎస్కే హజ్రత్, ఎస్కే అస్మా, జె. కేదారేశ్వరి, బి. వెంకటేశ్, పి. మహేందర్, దినకర్, ఆర్. శ్రీను, పి. మహేందర్, సాగర్ (కోచ్), బి. సత్య నారాయణ (మేనేజర్). -
రంగారెడ్డి ‘డబుల్’
హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల, పురుషుల టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా జట్లు సత్తా చాటాయి. స్థానిక రమ్య గ్రౌండ్లో జరిగిన ఈ టోర్నీలో మహిళల, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. శనివారం జరిగిన మహిళల ఫైనల్లో రంగారెడ్డి జట్టు హైదరాబాద్‌పై గెలుపొందగా, పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు నిజామాబాద్‌ను ఓడించింది. ఆదిలాబాద్ (మహిళల విభాగం), మెదక్ జట్లు మూడో స్థానంలో నిలిచాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. టగ్ ఆఫ్ వార్ పోటీలపై యువత ఆసక్తి కనబరచడం హర్షనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇప్పటివరకు నామమాత్రపు క్రీడగానే పరిగణించిన టగ్ ఆఫ్ వార్ ఈవెంట్‌కు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందించేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం హర్షనీయమన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోనూ ఇండోర్ స్టేడియాలు, షటిల్ కోర్టులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టగ్ ఆఫ్ వార్ సంఘం అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు శుభారంభం చేశాయి. కూకట్‌పల్లిలోని రమ్య ప్లేగ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి. మహిళల విభాగంలో హైదరాబాద్ 2–1తో ఆదిలాబాద్‌పై గెలుపొందగా, పురుషుల విభాగం తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 3–0తో నల్లగొండపై, రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ 3–0తో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించాయి. ఇతర పురుషుల మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 3–0తో కరీంనగర్‌పై, నిజామాబాద్ 3–0తో ఆదిలాబాద్‌పై, వరంగల్ 3–0తో ఖమ్మంపై, మెదక్ 3–0తో నల్లగొండపై, ఆదిలాబాద్ 3–0తో వరంగల్‌పై, నిజామాబాద్ 3–0తో ఖమ్మంపై, రంగారెడ్డి 3–0తో ఖమ్మంపై నెగ్గాయి. -
రంగారెడ్డి, హైదరాబాద్ జట్లకు టైటిల్స్
రాష్ట్ర స్థాయి టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: సీనియర్ (బీచ్) అంతర్ జిల్లా టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు సత్తా చాటాయి. కందుకూర్లోని న్యూ ఆదర్శ్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ టోర్నీ పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు విజేతగా నిలవగా... మహిళల విభాగంలో హైదరాబాద్ జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో రంగారెడ్డి జట్టు 3–0తో హైదరాబాద్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 3–0తో నల్లగొండపై, హైదరాబాద్ 2–1తో నిజామాబాద్‌పై నెగ్గాయి. మహిళల ఫైనల్లో హైదరాబాద్ జట్టు 3–0తో రంగారెడ్డి జట్టును ఓడించి విజేతగా నిలిచింది. సెమీస్ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి జట్టు 3–0తో ఆదిలాబాద్‌పై, హైదరాబాద్ జట్టు 3–0తో నిజామాబాద్‌పై గెలిచాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం కార్యదర్శి పి. ఎమ్మాన్యుయేల్, రంగారెడ్డి జిల్లా టగ్ ఆఫ్ వార్ సంఘం అధ్యక్షుడు జి. యాదయ్య, కార్యదర్శి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
కాంస్యం నెగ్గిన తెలంగాణ
టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహారాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం ఆధ్వర్యంలో కొల్హాపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ అండర్-13 బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్ ) చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి పతకం సాధించిన రాష్ట్ర జట్టును శుక్రవారం అభినందించారు.