హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల, పురుషుల టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా జట్లు సత్తా చాటాయి. స్థానిక రమ్య గ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో మహిళల, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. శనివారం జరిగిన మహిళల ఫైనల్లో రంగారెడ్డి జట్టు హైదరాబాద్‌పై గెలుపొందగా, పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు నిజామాబాద్‌ను ఓడించింది. ఆదిలాబాద్ (మహిళల విభాగం), మెదక్ జట్లు మూడో స్థానంలో నిలిచాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. టగ్ ఆఫ్ వార్ పోటీలపై యువత ఆసక్తి కనబరచడం హర్షనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇప్పటివరకు నామమాత్రపు క్రీడగానే పరిగణించిన టగ్ ఆఫ్ వార్ ఈవెంట్‌కు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందించేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం హర్షనీయమన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోనూ ఇండోర్ స్టేడియాలు, షటిల్ కోర్టులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టగ్ ఆఫ్ వార్ సంఘం అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.