
న్యూఢిల్లీ: మ్యాచ్ ముగిసేందుకు ఇక రెండే నిమిషాలు మిగిలుంది. దబంగ్ ఢిల్లీ 28–26తో ఆధిక్యంలో ఉంది. కానీ రెండు నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారింది. విజయం యు ముంబాను వరించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యు ముంబా 30–28 స్కోరుతో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో రైడర్ శ్రీకాంత్ జాదవ్ (11) రాణించాడు. 20 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను పది పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్‌లో మరో పాయింట్ చేశాడు. కశ్‌లింగ్ అడకె 7, అనూప్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. దబంగ్ ఢిల్లీ తరఫున అబొల్ ఫజల్ 6, రోహిత్ బలియాన్, మిరాజ్ షేక్ చెరో 4 పాయింట్లు చేశారు.
సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆట ఆరంభం నుంచి ఆధిపత్యం చాటిన ఢిల్లీ... ఒకానొక దశలో 12–3తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. చాలా ఆలస్యంగా పుంజుకున్న యు ముంబా చక్కని రైడింగ్‌లతో ప్రత్యర్థి జట్టుకు సవాల్ విసిరింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ముంబా 16–17తో ఒక పాయింట్‌తో వెనుకబడింది. తర్వాత ద్వితీయార్ధంలో మ్యాచ్ ముగిసే దశలో మెరుపు రైడింగ్‌లతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. లీగ్‌లో ఢిల్లీకిది ఎనిమిదో పరాభవం కాగా... యు ముంబాకు ఎనిమిదో విజయం. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్; దబంగ్ ఢిల్లీతో పుణేరి పల్టన్ తలపడతాయి.