పట్నా vs యు ముంబా
ప్రొ కబడ్డీ ఫైనల్లో నేడు అమీతుమీ
సెమీస్‌లో ఓడిన పుణెరి, బెంగాల్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో అత్యంత పటిష్ట జట్లుగా పేరుతెచ్చుకున్న డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా, పట్నా పైరేట్స్ తుది పోరుకు అర్హత సాధించాయి. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిల్చిన ఈ జట్లు సెమీఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై స్థాయికి తగ్గ ఆటతీరును చూపి ఏకపక్ష విజయాలు సాధించాయి. నేడు (శనివారం) రాత్రి తొమ్మిది గంటల నుంచి జరిగే ఫైనల్లో ముంబా, పట్నా తలపడుతాయి. దీనికి ముందు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో పుణెరి పల్టన్, బెంగాల్ వారియర్స్ తలపడుతాయి.
శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో పట్నా పైరేట్స్ 40-21 తేడాతో పుణెరి పల్టన్‌ను చిత్తు చేసింది. ప్రదీప్ నర్వాల్ 10, రోహిత్ కుమార్ 6 రైడింగ్ పాయింట్లు సాధించారు. పుణెరి నుంచి దీపక్ హుడా ఆరు పాయింట్లు సాధించాడు. లీగ్ దశలో ఈ జట్లు రెండు సార్లు తలపడగా డ్రా ఫలితమే వచ్చింది. అయితే లీగ్ మ్యాచ్‌ల్లో చూపించిన తెగువ కీలక సెమీస్‌లో పుణెరి చూపలేకపోయింది. తొలి నిమిషం నుంచే ప్రత్యర్థిపై పట్నా ఎదురుదాడికి దిగింది. రైడ్‌కు వెళితే చాలు పాయింట్ ఖాయం అన్నట్టుగా ఆటగాళ్లు రెచ్చిపోయారు. దీంతో తొమ్మిదో నిమిషంలోనే పుణే ఆలౌట్ అయ్యింది. ఈ ఊపు అలాగే కొనసాగగా.. 12వ నిమిషంలో ప్రదీప్ నర్వాల్ సూపర్ రైడ్‌తో పట్నాకు ఆరు పాయింట్లు దక్కాయి. పుణెరి కోర్టులో ఉన్న నలుగురు ఆటగాళ్లను తను ఒకేసారి అవుట్ చే సి కోర్టును ఖాళీ చేశాడు. దీంతో తొలి అర్ధభాగానికి పట్నా 25-7తో సంపూర్ణ ఆధిక్యం సాధించింది.
అయితే ద్వితీయార్ధంలో పుణెరి గేరు మార్చింది. వరుసగా 9 పాయింట్లు సాధించడంతో పాటు పట్నాను ఆలౌట్ చేసింది. ఆ తర్వాత వెంటనే పుంజుకున్న పట్నా తిరిగి పైచేయి సాధించింది. పట్నా సూపర్ రైడింగ్ ముందు పుణెరి డిఫెన్స్ పూర్తిగా తేలిపోవడంతో వారికి పరాజయం తప్పలేదు మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 41-29 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను మట్టికరిపించింది. రిషాంక్ దేవ డిగ 11, అనూప్ కుమార్ 6 రైడ్ పాయింట్లు సాధించారు. ఆది నుంచే చెలరేగిన ముంబా ఆటగాళ్లు ప్రత్యర్థిని తొమ్మిదో నిమిషంలో ఆలౌట్ చేశారు. ఆ తర్వాత కూడా బెంగాల్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ప్రథమార్ధం 26-8తో ముగించింది. ద్వితీయార్ధంలోనూ బెంగాల్ ఏమాత్రం ప్రభావం చూపకపోగా ముంబా ఆటగాళ్లు చ కచకా పాయింట్లు సాధిస్తూ తమ స్కోరును పెంచుకుంటూ వెళ్లడంతో విజయం ఖాయమైంది.