కబడ్డీ కూత కోటి కాదు రూ.కోటిన్నరను దాటేసింది. ఆల్‌రౌండర్లు, ‘ఎ’ కేటగిరీ ప్లేయర్లు ఆటకు ముందు వేలం పాటలో సూపర్ హిట్టయ్యారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో రూ. కోటి మార్కు దాటిన తొలి భారత ఆటగాడిగా దీపక్ నివాస్ హుడా గుర్తింపు పొందగా... ఆ వెంటనే కోటిన్నర దాటిన ఆటగాడిగా మోనూ గోయట్ కొత్త చరిత్ర సృష్టించాడు.
ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి : తెరపైకి ఎన్ని లీగ్‌లు వచ్చినా ఒక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పైనే ఎక్కువ చర్చ జరిగేది. ఇకపై ఐపీఎల్ గురించే కాదు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) గురించి కూడా చర్చించుకునే రోజులొచ్చేశాయి. ప్రేక్షకుల ఆదరణలో ఐపీఎల్ అంత కాకపోయినా ఆ తర్వాత స్థానంలో ఉన్న కబడ్డీ లీగ్‌లోనూ ఆటగాళ్లు రూ. కోట్లు కొల్లగొట్టారు. మోనూ గోయట్ రికార్డు స్థాయిలో రూ.1.51 కోట్లు పలికాడు. అతని కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు హరియాణా స్టీలర్స్ అతన్ని చేజిక్కించుకుంది. వేలం మొదటి రోజు ఇరాన్ ఆటగాడు ఫజల్ అట్రాచలి ముందుగా ‘కోటి’ క్లబ్‌లో చేరాడు. ఆ తర్వాత ఐదుగురు భారత ఆటగాళ్లు కోటిని దాటేశారు. తొలిరోజు వేలంలో భారత ఆటగాళ్లు దీపక్ నివాస్ హుడా, నితిన్ తోమర్‌లపై ఫ్రాంచైజీలు కన్నేశాయి.
తొలి రోజు రెండు సెషన్ల పాటు వేలం జరిగింది. తొలి సెషన్‌లో ఇరాన్ డిఫెండర్ ఫజల్ రూ. కోటి క్లబ్‌లో చేరాడు. ఇక రెండో సెషన్‌లో భారత ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంచైజీలన్నీ వేలంపాటలో ఉత్సాహం కనబరిచాయి. ఆశ్చర్యకరంగా స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని వదిలేసుకున్న తెలుగు టైటాన్స్ అతన్ని ఫైనల్ బిడ్ మ్యాచ్ (ఎఫ్‌బీఎమ్)తో రూ. కోటి 29 లక్షలకు చేజిక్కించుకుంది. ఎఫ్‌బీఎమ్ అంటే ఫ్రాంచైజీలు వదిలేసిన ఆటగాళ్లను వేలంలో వేరే ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే గత ఫ్రాంచైజీలు ఎఫ్‌బీఎమ్ కార్డ్‌తో దక్కించుకోవచ్చు. నితిన్, దీపక్ హుడా రూ. కోటి 15 లక్షలు పలికారు. నితిన్‌ను పుణేరి, దీపక్‌ను జైపూర్ దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment