
ఢిల్లీకి తెలుగు టైటాన్స్ షాక్
* పట్నాకు రెండో పరాజయం
* ప్రొ కబడ్డీ లీగ్
పట్నా: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన తెలుగు టైటాన్స్ జట్టు... ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 28-23తో దబాంగ్ ఢిల్లీ కేసీపై గెలిచింది. టైటాన్స్ తరఫున రైడింగ్‌లో నీలేశ్ సలాంకే (7), రాహుల్ చౌదరి (5)లు... క్యాచింగ్‌లో సందీప్ (6), జస్మేర్ సింగ్ (2), సందీప్ నర్వాల్ (2)లు ఆకట్టుకున్నారు. ఢిల్లీ ఆటగాళ్లు సచిన్ (6), అనిల్ (4), సెల్వమణి (3) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
పట్నాను ఓడించి సూపర్ ఫామ్‌లో ఉన్న ఢిల్లీని టైటాన్స్ డిఫెన్స్‌తో పడగొట్టింది. ఆరంభంలో రాహుల్ చౌదరి రైడింగ్‌తో పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు. అయితే 5వ నిమిషంలో చౌదరిని చాకచక్యంగా ట్యాకిల్ చేసి ఢిల్లీ ఖాతా తెరిచింది. ఏడు నిమిషాల వరకు ఢిల్లీ ఆటగాళ్లు రైడింగ్‌లో పాయింట్లు సాధించలేకపోయారు. చివరకు తొమ్మిదో నిమిషంలో తొలి రైడింగ్ పాయింట్ రాబట్టుకుంది. 11వ నిమిషంలో చౌదరి రెండు పాయింట్లు తేవడంతో టైటాన్స్ ఆధిక్యం 7-3కు చేరింది. తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 21-26తో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. పట్నాకు ఇది వరుసగా రెండో పరాజయం. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్; పుణెరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.