‘ఆరంభం’ మారాలి!
సాక్షి క్రీడా విభాగం
కొన్నాళ్ల క్రితం శిఖర్ ధావన్, రోహిత్ శర్మల ఓపెనింగ్ జోడి అందించిన అద్భుత విజయాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. వరుసగా భారీ భాగస్వామ్యాలతో ఈ ఇద్దరు దాదాపు ప్రతీ మ్యాచ్‌లో జట్టు గెలుపు కోసం బాట పరిచారు.
ఒక్క మాటలో చెప్పాలంటే కుడి, ఎడమ చేతివాటం కాంబినేషన్‌తో సెహ్వాగ్, గంభీర్‌లను మరిపించి వీరు తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. ఈ జోడి ఆటతోనే చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆ తర్వాత వరుసగా మరో మూడు టోర్నీల్లో భారత్ విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ జోరు తగ్గింది. ఏ జట్టు విజయానికైనా చుక్కానిలాంటి ఓపెనింగ్ ఇప్పుడు భారత్‌కు కొత్త సమస్యగా మారింది.
ఈ ఇద్దరు చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ నెలకొల్పకపోవడం టీమ్‌పై ప్రభావం చూపిస్తోంది. వ్యక్తిగతంగా చూసినా ధావన్, రోహిత్ ఒకరితో మరొకరు పోటీ పడి విఫలమవుతున్నారు. కివీస్‌తో జరిగిన గత రెండు వన్డేల్లో వీరిద్దరు కలిపి మొత్తం 125 బంతులు ఎదుర్కొని 69 పరుగులు మాత్రమే చేయగలిగారు. ప్రస్తుతం కివీస్‌తో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. ఇరు జట్ల మధ్య శనివారం జరిగే మూడో వన్డే కోసం టీమిండియా ఓపెనింగ్‌లో మార్పులు చేస్తుందా, వీరినే కొనసాగిస్తుందా చూడాలి.
పదే పదే అదే ఆట...
ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన ఆఖరి వన్డేలో తొలి వికెట్‌కు ధావన్, రోహిత్ 112 పరుగులు జోడించారు. రోహిత్ డబుల్ సెంచరీ చేసిన ఈ మ్యాచ్ తర్వాత ఆరంభ జోడి ఆట గతి తప్పింది. ఆ తర్వాత జరిగిన ఏడు వన్డేల్లో వీరిద్దరు కలిసి వరుసగా 17, 21, 29, 14, 10, 15, 22 పరుగులు జత చేశారు.
తాము ఓపెనర్లుగా బరిలోకి దిగిన తొలి 17 వన్డే మ్యాచుల్లో వీరు ఆరు సెంచరీ భాగస్వామ్యాలు, మరో రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. దాంతో పోలిస్తే భారత ఓపెనింగ్ ఇప్పుడు సమస్యగానే మారిందనవచ్చు. పరుగులు రాకపోవడమే కాదు, ఓపెనర్లుగా వీరి ఆటతీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఇంగ్లండ్ గడ్డపై దూకుడైన ఆటతోనే సరిపెట్టకుండా చక్కటి షాట్ల ద్వారా పరుగులు రాబట్టారు. బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ సింగిల్స్, ప్లేసింగ్స్ ద్వారా స్కోరుబోర్డును పరుగెత్తించారు.
అయితే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో అది లోపించింది. ఇప్పుడు ప్రతీ బంతిని ఎదుర్కోవడంలో రోహిత్‌లో తడబాటు కనిపిస్తుండగా...అవసరం ఉన్నా లేకపోయినా మళ్లీ మళ్లీ ఒకే తరహా షాట్ ఆడి ధావన్ నిష్ర్కమిస్తున్నాడు. ఇక దక్షిణాఫ్రికాలో స్టెయిన్ బౌలింగ్‌లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు ఆడిన రోహిత్ అయితే కివీస్ పరిస్థితుల్లో కూడా తడబడుతున్నాడు. తొలి వన్డేలో సౌతీ బౌలింగ్‌లో అతను వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు ఆడగా...రెండో మ్యాచ్‌లో కూడా భారత్ రెండు, మూడు ఓవర్లలో ఒక్క పరుగూ చేయలేదు.
రాయుడును ఆడిస్తారా...
మూడో వన్డేలో మార్పులకు అవకాశం ఉందని కెప్టెన్ ధోని ఇప్పటికే సూత్రప్రాయంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ జోడిలో మార్పు జరగవచ్చు. రహానేను ఓపెనర్‌గా పంపి రోహిత్‌ను నాలుగో స్థానంలో ఆడించేందుకు అవకాశం ఉంది.
రోహిత్‌కు కాస్త విరామం ఇవ్వాలని భావిస్తే మిడిలార్డర్‌లో రాయుడు సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. వరుసగా రెండో పర్యటనలోనూ అతనికి ఒక్క మ్యాచ్ కూడా దక్కలేదు. చక్కటి స్ట్రోక్ మేకర్ అయిన రాయుడుకు అవకాశం కల్పించి అతని సత్తాను కూడా పరీక్షించవచ్చు. మరో వన్డే ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉండటంతో ధోని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడన్నది ఆసక్తికరం.