
న్యూఢిల్లీ: భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉషను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపిక చేసింది. మన దేశంలో విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారంలాంటిదే ‘వెటరన్ పిన్’ అవార్డు. తను ఈ అవార్డుకు ఎంపికైన విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో తెలియజేసింది. ‘ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డు అందజేస్తారు. అలాంటి విశిష్ట పురస్కారానికి నేను ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. ఐఏఏఎఫ్‌కు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది. దోహాలో సెప్టెంబర్ 24న జరిగే ఐఏఏఎఫ్ కాంగ్రెస్‌లో 55 ఏళ్ల ఉషకు ఈ అవార్డు అందజేస్తారు.