‘నయా వాల్‌’ మరోసారి... | Pujara and Rahane power India to 344/3 | Sakshi
Sakshi News home page

‘నయా వాల్‌’ మరోసారి...

Published Fri, Aug 4 2017 12:03 AM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

‘నయా వాల్‌’ మరోసారి...

‘నయా వాల్‌’ మరోసారి...

∙ పుజారా అజేయ సెంచరీ
∙ రహానే శతకం
∙ భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 344/3
∙ శ్రీలంకతో రెండో టెస్టు


కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్‌ చెలరేగుతోంది. చతేశ్వర్‌ పుజారా (225 బంతుల్లో 128 బ్యాటింగ్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి తన క్లాస్‌ ఆటతో అభిమానులను సమ్మోహనపరుస్తూ వరుసగా రెండో సెంచరీతో సత్తాను చాటుకున్నాడు. అతనికి తోడు అజింక్యా రహానే (168 బంతుల్లో 103 బ్యాటింగ్‌; 12 ఫోర్లు) కూడా ఈ ఫార్మాట్‌లో తన లయను అందుకున్నాడు. ఆరంభంలో కాస్త ఇబ్బందిపెట్టిన లంక బౌలర్లను ఈ జోడి అద్భుత నైపుణ్యంతో ఎదుర్కొన్న తీరు ఆమోఘం. వీరిద్దరి అజేయ శతకాలతో జట్టు తొలి రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో గురువారం తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో మూడు వికెట్లకు 344 పరుగులు చేసింది.

పుజారా, రహానే మధ్య ఇప్పటికే నాలుగో వికెట్‌కు అజేయంగా 211 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (82 బంతుల్లో 57; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌ ధావన్‌ (37 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ కోహ్లి (29 బంతుల్లో 13; 2 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. హెరాత్, పెరీరాలకు చెరో వికెట్‌ దక్కింది.
 
తొలి సెషన్‌   ధావన్‌ వేగం
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈసారి శుభారంభం దక్కలేదు. అయితే ధావన్‌ ప్రారంభం నుంచే దూకుడు కనబరిచాడు. రెండో ఓవర్‌లోనే సిక్సర్‌ బాదిన తను దాదాపుగా బంతికో పరుగు చొప్పున వేగంగా ఆడడంతో జట్టు 52 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. అయితే పెరీరా బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన ధావన్‌ ఎల్బీగా వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పుజారా, రాహుల్‌ ఆచితూచి ఆడడంతో స్కోరు నెమ్మదించింది. 72 బంతుల్లో ఓ ఫోర్‌తో రాహుల్‌ అర్ధ సెంచరీ సాధించాడు. మరో వికెట్‌ పడకుండా జట్టు లంచ్‌ విరామానికి వెళ్లింది.
ఓవర్లు: 28, పరుగులు: 101, వికెట్లు: 1
 
రెండో సెషన్‌  :  పుజారా క్లాస్‌
బ్రేక్‌ తర్వాత మూడో ఓవర్‌లోనే జోరు మీదున్న రాహుల్‌ దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు. 31వ ఓవర్‌లో రాహుల్‌ కవర్‌లో షాట్‌ ఆడగా పరుగు కోసం పిలిచిన పుజారా అంతలోనే వెనక్కి వెళ్లాడు. అప్పటికి కాస్త ముందుకు వచ్చిన రాహుల్‌ తిరిగి వెనక్కి వెళ్లినా కీపర్‌ డిక్‌వెల్లా వికెట్లను పడగొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కెప్టెన్‌ కోహ్లి.. హెరాత్‌ బౌలింగ్‌లో వైడ్‌ బంతిని ఆడబోయి క్యాచ్‌ అవుటయ్యాడు. ఈదశలో పుజారాకు రహానే జత కలవడంతో లంకకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 104 బంతుల్లోనే వంద పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచిన అనంతరం ఈ జోడి టీ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 30, పరుగులు: 137, వికెట్లు: 2

చివరి సెషన్‌   పుజారా, రహానే శతకాలు
టీ విరామం అనంతరం పుజారా జోరును ప్రదర్శించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ 164 బంతుల్లో కెరీర్‌లో 13వ శతకాన్ని అందుకున్నాడు. అయితే 112 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన పుజారా ఆ తర్వాత 50 పరుగులను కేవలం 52 బంతుల్లోనే సాధించడం తన వేగాన్ని సూచిస్తోంది. ఇక 80 పరుగుల వద్ద క్యాచ్‌ అవుట్‌ నుంచి తప్పించుకున్న రహానే 151 బంతుల్లో కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ సాధించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన ఈ జోడి తొలి రోజును విజయవంతంగా ముగించింది. డీఆర్‌ఎస్‌ ద్వారా రహానే రెండుసార్లు ఎల్బీ నుంచి లబ్ధి పొందడం విశేషం. ఓవర్లు: 32, పరుగులు: 106, వికెట్లు: 0

వైద్య పరీక్షల కోసం స్వదేశానికి రోహిత్‌
గత నవంబర్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ రొటీన్‌ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం భారత్‌కు చేరుకున్నాడు.

3 సెహ్వాగ్‌ (79), గావస్కర్‌ (81) తర్వాతవేగంగా (84 ఇన్నింగ్స్‌) 4 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌ పుజారా.

6 రాహుల్‌ వరుసగా చేసిన అర్ధ సెంచరీల సంఖ్య. గతంలో గుండప్ప విశ్వనాథ్, ద్రవిడ్‌ ఇలాగే వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement