
రాణించిన రైజింగ్ పుణె
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన పుణె ఆది నుంచి దూకుడును కొనసాగించింది. పుణె ఓపెనర్లు అజింక్యా రహానే(46;41 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి(38;23 బంతుల్లో 7 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడి 65 పరుగుల జత చేసిన తరువాత త్రిపాఠి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆ తరుణంలో రహానేకు జత కలిసిన కెప్టెన్ స్మిత్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 47 పరుగులు జోడించిన తరువాత రహానే పెవిలియన్ కు చేరాడు. సునీల్ నరైన్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడిన రహానే స్టంప్ అవుట్ అయ్యాడు.
ఆపై స్మిత్-ధోనిలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్కోరును పెంచే క్రమంలో ధోని(23;11 బంతుల్లో1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడబోయి మూడో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో స్మిత్(51 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా, క్రిస్టియన్(16) ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్ గా పుణె బ్యాట్స్ మెన్ రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు లభించగా, ఉమేశ్ యాదవ్,సునీల్ నరైన్లకు తలో వికెట్ దక్కింది.