సైనాపై సింధు పైచేయి | PV Sindhu Beats Saina Nehwal | Sakshi
Sakshi News home page

సైనాపై సింధు పైచేయి

Published Sat, Jan 14 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

సైనాపై సింధు పైచేయి

సైనాపై సింధు పైచేయి

పీబీఎల్‌–2 ఫైనల్లో చెన్నై స్మాషర్స్‌

న్యూఢిల్లీ: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో తనకు ఎదురులేదని పీవీ సింధు నిరూపించుకుంది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–2)లో భాగంగా అవధ్‌ వారియర్స్‌తో జరిగిన సెమీఫైనల్లో చెన్నై స్మాషర్స్‌ 4–1 పాయింట్ల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అందరి దృష్టినీ ఆకర్షించిన మహిళల సింగిల్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో పీవీ సింధు (చెన్నై) 11–7, 11–8తో సైనా నెహ్వాల్‌ (వారియర్స్‌)ను ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం, చైనా ఓపెన్‌లో టైటిల్‌తో కొంతకాలంగా సూపర్‌ ఫామ్‌లో ఉన్న సింధు అదే జోరును సైనాతో మ్యాచ్‌లోనూ కొనసాగించింది.

మరోవైపు గాయం నుంచి కోలుకున్న సైనా తన ప్రత్యర్థి దూకుడు ముందు నిలబడలేకపోయింది. అంతకుముందు తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–గాబ్రియెలా అడ్‌కాక్‌ (చెన్నై) జంట 11–9, 8–11, 5–11తో సావిత్రి అమిత్రపాయ్‌–బోదిన్‌ ఇసారా (వారియర్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. అయితే పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్‌ (చెన్నై) 11–4, 11–6తో విన్సెంట్‌ వోంగ్‌ (వారియర్స్‌)పై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 14–12, 11–7తో టామీ సుగియార్తో (చెన్నై)పై నెగ్గడంతో వారియర్స్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. బరిలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో సైనాపై సింధు నెగ్గడంతో చెన్నై 3–2తో ఆధిక్యంలోకి వచ్చింది. వారియర్స్‌ ఎంచుకున్న పురుషుల డబుల్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌ లో క్రిస్‌ అడ్‌కాక్‌–కోల్డింగ్‌ (చెన్నై) జంట 11–3, 12–10తో గో వి షెమ్‌–మార్కిస్‌ కిడో (వారియర్స్‌) ద్వయంపై గెలవడంతో చెన్నై స్మాషర్స్‌ తుదకు 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హైదరాబాద్‌ హంటర్స్, ముంబై రాకెట్స్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో శనివారం జరిగే ఫైనల్లో చెన్నై స్మాషర్స్‌ తలపడుతుంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement