
సింధుకు నిరాశ
►క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన భారతస్టార్
►ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
వుహాన్: చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత నం.1 ప్లేయర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, నాలుగో సీడ్ సింధు 21–15, 14–21, 22–24తో ఎనిమిదో సీడ్ హే బింగ్‌జియావో (చైనా) చేతిలో పోరాడి ఓడింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్‌లో నెగ్గిన సింధు.. తర్వాతి గేమ్‌ల్లో ఆస్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. తొలిగేమ్ ఆరంభంలో 3–3, 4–4తో స్కోర్లు సమమైనా అనంతరం దూకుడైన ఆటతీరుతో సింధు ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇదే జోరును కొనసాగించిన భారతస్టార్.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా ఆ గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే రెండోగేమ్‌లో పుంజుకున్న చైనీస్ ప్లేయర్ క్రమంగా ఆధిక్యం పెంచుకుంటూ పోయి గేమ్‌ను కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభంలో 1–8తో వెనుకంజలో నిలిచిన సింధు అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించింది. కీలకదశలో పాయింట్లు కైవసం చేసుకుని చాలాసార్లు స్కోరును సమం చేసింది. 16–16తో సమంగా ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లను సాధించిన చైనీస్ ప్లేయర్ విజయం ముంగిట నిలిచింది. ఈదశలో సింధు హోరాహోరీగా పోరాడి 22–21తో మ్యాచ్‌పాయింట్ ముంగిట నిలిచింది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన బింగ్‌జియావో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.