
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ కోర్టులో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ప్రస్తుతం లండన్‌లోని గ్యాటోరెడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ (జీఎస్‌ఎస్‌ఐ)తో కలిసి పనిచేస్తోన్న సింధు ప్రస్తుతం ఆటతోపాటు ఆరోగ్యపరంగా పూర్తి ఫిట్‌గా ఉన్నానని చెప్పింది. జనవరిలో ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలతో కోర్టులో అడుగుపెడతానంది. ఈ మేరకు సన్నద్ధమవుతున్నానని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో 2021లోనే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని ముందే ఊహించానని... అందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని పేర్కొంది.
అందరూ ఊహించుకుంటున్నట్లుగా చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. ఆయనకు సమాచారమిచ్చాకే జీఎస్‌ఎస్‌ఐతో కలిసి పనిచేస్తున్నానని చెప్పింది. న్యూట్రిషియన్, ఫిట్‌నెస్‌తో పాటు పలు అంశాలపై గత నాలుగేళ్లుగా జీఎస్‌ఎస్‌ఐ అనుబంధాన్ని కొనసాగిస్తున్నానని తెలిపింది. ప్రపంచ మాజీ చాంపియన్స్ నొజోమి ఒకుహారా (జపాన్), కరోలినా మారిన్ (స్పెయిన్)లతో జరిగే మ్యాచ్‌ల్లో తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తానని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment